ODI Rankings : నంబర్ వన్ ర్యాంకుతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టేది ఎవరో..? అగ్రస్థానం కోసం మూడు జట్ల మధ్య పోటీ..?
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనుంది. ఈ క్రమంలో వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచి మెగా టోర్నీలో అడుగుపెట్టాలని మూడు టీమ్‌లు భావిస్తున్నాయి.

Race for top spot in ODIs
ICC ODI Rankings : భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనుంది. ఈ క్రమంలో వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచి మెగా టోర్నీలో అడుగుపెట్టాలని మూడు టీమ్‌లు భావిస్తున్నాయి. ఆ జట్లు మరేవో కాదు.. టీమ్ఇండియా (Team India), ఆస్ట్రేలియా(Australia), పాకిస్తాన్ (Pakistan). గత కొద్ది రోజులుగా ఈ మూడు జట్ల మధ్య నంబర్ వన్ ర్యాంకు మ్యూజికల్ ఛైర్ గేమ్ ఆడుతోంది. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలోనే పాకిస్తాన్ నిష్ర్కమించినప్పటికి తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.
ఇక ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ రెండో స్థానానికే పరిమితమైంది. ఆస్ట్రేలియా మూడులో కొనసాగుతోంది. ఈ మూడు జట్ల మధ్య పాయింట్ల అంతరం చాలా స్వల్పంగా ఉండడం, వన్డే ప్రపంచకప్ ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డే మ్యాచుల సిరీస్ ఆడనుండడంతో మరోసారి ర్యాంకింగ్స్‌లో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
వన్డే ర్యాంకింగ్స్‌లో సెప్టెంబర్ 14న ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. అయితే.. దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల మ్యాచుల సిరీస్‌ను 3-2తో కోల్పోవడంతో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. దీంతో పాకిస్తాన్ 114.899 రేటింగ్ పాయింట్లతో మొదటి ర్యాంకును అందుకుంది. కాగా.. ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో ఓడిపోవడంతో టీమ్ఇండియా 114.659 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా ఖాతాలో 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
భారత్, ఆస్ట్రేలియాకు ఛాన్స్..
పాకిస్తాన్ జట్టు అగ్రస్తానంలో వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ప్రపంచకప్ ముందు ఆ జట్టు ఎలాంటి వన్డే మ్యాచులు ఆడదు. అదే సమయంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించిన జట్లు నంబర్ వన్ ర్యాంకును దక్కించుకునే అవకాశం ఉంది. ఒకవేళ టీమ్ఇండియా గనుక వన్డే ర్యాంకింగ్స్ లో నంబర్ వన్‌గా నిలిస్తే అప్పుడు ఒకేసారి మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న జట్టుగా రికార్డులకు ఎక్కుతుంది. ప్రస్తుతం భారత్.. టెస్టులు, టీ20ల్లో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే
Ashwin : అక్షర్ పటేల్ గాయం.. అశ్విన్‌కు వరంగా మారనుందా..? రోహిత్ చెప్పింది అదేనా..?