Ravindra Jadeja : రవీంద్ర జడేజా కీలక వ్యాఖ్యలు.. నా సమయం ముగిసింది..
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు ఎవరంటే రవీంద్ర జడేజానే

Ravindra Jadeja comments over test captaincy ambition
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు ఎవరంటే రవీంద్ర జడేజానే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టుల నుంచి తప్పుకున్నాక, బుమ్రా పై పని ఒత్తిడి లేకుండా చేసేందుకు బీసీసీఐ అతడికి సారథ్యం ఇవ్వలేదు. ఈ క్రమంలో రవీంద్ర జడేజానే తదుపరి భారత టెస్టు కెప్టెన్ అవుతాడని చాలా మంది భావించారు. అయితే.. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు నాయకత్వ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది.
రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో రెండో రోజు మ్యాచ్ ముగిసిన తరువాత విలేకరుల సమావేశంలో కెప్టెన్సీ పై జడేజాకు ప్రశ్న ఎదురైంది. కెప్టెన్సీ ఆశయం ఎప్పుడైనా ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. “లేదు, ఆ సమయం ఇప్పుడు లేదు” అని అంటూ నవ్వుతూ చెప్పాడు.
కొత్త కెప్టెన్ గిల్ గురించి మాట్లాడుతూ..
”నిజాయితీగా చెప్పాలంలే గిల్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడి కాన్ఫిడెన్స్ స్థాయిని గమనించాను. అతడు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ నాయకుడిగా కనిపించలేదు. అదనపు బాధ్యతలను మోసేందుకు సిద్ధంగా ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాడు తప్ప.. లేకుంటే ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఔట్ అవుతాడని అస్సలు ఊహించలేదు. మేము భాగస్వామ్యాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయం పై ఎక్కువగా మాట్లాడుకున్నాం.” అని జడేజా చెప్పాడు.
గిల్, జడేజా లు ఆరో వికెట్‌కు 203 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులు చేసింది. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. జో రూట్(18), హ్యారీ బ్రూక్ (30) లు క్రీజులో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు ఇంగ్లాండ్ ఇంకా 510 పరుగులు వెనుకబడి ఉంది.