Virat Kohli-Rohit Sharma : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటర్న్ సిరీస్ ‘రద్దు’! రోకో ద్వయాన్ని మళ్లీ ఎప్పుడు చూస్తామంటే..?
అంతర్జాతీయ క్రికెట్‌లో రో-కో ద్వయం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.

Virat Kohli and Rohit Sharma Return Series Cancelled Report
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20లు, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో రో-కో ద్వయం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఈ జంటను మైదానంలో వీక్షించాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురవనుంది. బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు నెలలో భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆగస్టు 17 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. బంగ్లాదేశ్‌లో అనిశ్చిత రాజకీయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆటగాళ్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
మీడియా హక్కుల అమ్మకాలను నిలిపివేసిన బీసీబీ..
టీమ్ఇండియా సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు తామెప్పుడు కూడా సిద్ధమేనని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు కాకపోయినా మరోసారైనా నిర్వహించేందుకు సిద్ధం అని తెలిపింది.
టీమ్ఇండియా సిరీస్ మీడియా హక్కుల అమ్మకంతో భారీగా ఆదాయం ఆర్జించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించింది. ఈ క్రమంలో జూలై 7, 10వ తేదీల్లో బిడ్డింగ్‌ను నిర్వహించాలని భావించి అందుకు ఏర్పాట్లు సైతం చేసింది. అయితే.. ఇప్పుడు ఈ సిరీస్ వాయిదా పడే అవకాశం ఉండడంతో మీడియా హక్కుల అమ్మకాలను నిలిపివేయాలనే నిర్ణయాన్ని బీసీబీ తీసుకున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది.
ENG vs IND : పాపం రవీంద్ర జడేజా.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదురా అయ్యా..
అక్టోబర్‌లోనే..
బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దు అయితే.. భారత జట్టు వన్డేలను అక్టోబర్‌లోనే ఆడనుంది. అప్పుడు ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటించనుంది. మూడు వన్డేలు, 5 టీ20లను ఆడనుంది. తొలుత వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోనే రోహిత్ శర్మ, కోహ్లీలను భారత జెర్సీలలో చూసే అవకాశం ఉంది.