RCB Sale : ఆర్సీబీ అమ్మకం ప్రక్రియలో బిగ్ ట్విస్ట్.. రేసులోకి మరో ప్రముఖ సంస్థ.. బిగ్ ఫైట్..
RCB Sale : ఆర్సీబీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా.. ఈ పోటీలోకి ఆధిత్య బిర్లా గ్రూప్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలిసింది..
RCB Sale
- ఆర్సీబీ ప్రాంచైజీ విక్రయం ప్రక్రియలో బిగ్ ట్విస్ట్
- చివరిలో రేసులోకి ఆధిత్య బిర్లా గ్రూప్ ఎంట్రీ!
- 2 బిలియన్ డాలర్లు దాటే అవకాశం
RCB Sale : ఐపీఎల్ -2025 ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆర్సీబీ యాజమాన్యం డయాజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా పెట్టి ఈ అమ్మకాన్ని పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆర్సీబీ విక్రయ ప్రక్రియ చివరి దశలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఆర్సీబీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి. సుమారు 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1800 కోట్లు)కు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీని కొనుగోలు రేసులో రంజన్ పాయ్ కన్సార్టియం, స్వీడన్ కు చెందిన ఈక్యూటీ (EQT) సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోటీలోకి ఆధిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం రంగంలోకి దిగింది. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.
మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. బిర్లా గ్రూప్ అమెురికన్ క్రీడా పెట్టుబడిదారుడు డేవిడ్ బ్లిట్జర్‌తో చేతులు కలిపి ఐపీఎల్, ఉమెన్స్ ఐపీఎల్ ఛాంపియన్ల కోసం బిడ్ వేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆర్సీబీతోపాటు సమాంతరంగా జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్(RR) ప్రాంచైజీని కొనుగోలు చేసే రేసులో బిర్లా – బ్లిట్జర్ కన్షారియం ఉంది. బిర్లా – బ్లిట్జర్ కన్సార్టియం ఒక బిడ్‌ను పరిశీలిస్తోంది. కానీ, ఇంకా అధికారికంగా సమర్పించలేదు. ఈ గ్రూప్ అధికారికంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసే రేసులో ఉన్నప్పటికీ.. వారు ఆర్సీబీ కోసం జరిగే పోటీలోకి ప్రవేశిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి.
ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు బిర్లా -బ్లిట్జర్ కన్సార్టియం పోటీలోకి వస్తే ఆర్సీబీ ఫ్రాంచైజీ వాల్యూ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత నివేదిక ప్రకారం.. డియాజియో సుమారు 2 బిలియన్ డాలర్ల బిడ్ల కోసం చూస్తుండగా, కొందరు ఈ ఫ్రాంచైజీ విలువను 1.5 నుండి 1.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1400 నుండి రూ. 1500 కోట్లు) మధ్యగా అంచనా వేస్తున్నారు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఏ ఒక్కరూ రెండు ఫ్రాంచైజీల్లో వాటాను కొనుగోలు చేయలేరు. దీంతో బిర్లా-బ్లిట్జర్ కన్షార్టియం బిడ్డింగ్‌లో ఆర్సీబీ, ఆర్ఆర్ ప్రాంచైజీలను గెలుచుకుంటే ఏదో ఒక్క ఫ్రాంఛైజీని ఎంచుకోవాల్సి ఉంటుంది.
