RCB vs LSG : బెంగ‌ళూరు కొంప‌ముంచిన వికెట్ కీప‌ర్ అనూజ్‌రావ‌త్‌.. ఆ క్యాచ్ ప‌ట్టుంటే..!

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఏదీ క‌లిసి రావ‌డం లేదు.

RCB vs LSG : బెంగ‌ళూరు కొంప‌ముంచిన వికెట్ కీప‌ర్ అనూజ్‌రావ‌త్‌.. ఆ క్యాచ్ ప‌ట్టుంటే..!

Anuj Rawat

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. మంగ‌ళ‌వారం చిన్న‌స్వామి వేదిక‌గా లక్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ 28 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌వి చూసింది. ఈ సీజ‌న్‌లో మిగిలిన జ‌ట్లు అన్ని కూడా త‌మ సొంత మైదానాల్లో విజ‌యాలు సాధిస్తుంటే ఆర్‌సీబీ, ముంబై జ‌ట్లు మాత్ర‌మే ఓడిపోతున్నాయి. చిన్న‌స్వామి స్టేడియంలో ఆర్‌సీబీకి ఇది రెండో ఓట‌మి. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా ఈ సీజ‌న్‌లో నాలుగు మ్యాచులు ఆడిన ఆర్‌సీబీ మూడు మ్యాచుల్లో ఓడిపోయింది.

చెత్త ఫీల్డింగ్‌, పేల‌వ బౌలింగ్‌తో పాటు ప‌స‌లేని బ్యాటింగ్ వ‌ల్ల ఆర్‌సీబీ విజ‌యాల‌ను అందుకోలేక‌పోతుంది. ఇక ల‌క్నోతో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవ‌డంతో ఆ జ‌ట్టు కీప‌ర్ అనూజ్ రావ‌త్ పై ట్రోలింగ్ మొద‌లైంది. విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడిన నికోల‌స్ పూర‌న్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అత‌డు విడిచిపెట్ట‌డం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

ఈసారి కూడా కప్ లేనట్లేనా..! మళ్లీ ఓడిన ఆర్సీబీ.. ఫ్యాన్స్ ఫైర్

ల‌క్నో ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌లో ఇది చోటు చేసుకుంది. రీస్ టోప్లీ వేసిన ఈ ఓవ‌ర్‌లోని మూడో బంతికి పూర‌న్ షాట్ ఆడ‌గా ఎడ్జ్ తీసుకున్న బంతి స్క్వేర్ లెగ్ దిశ‌గా గాల్లోకి లేచింది. వికెట్ కీప‌ర్ అనూజ్ రావ‌త్‌, య‌శ్ ద‌యాల్ ప‌రిగెత్తారు. గ్లోవ్స్ ఉండ‌డంతో తాను క్యాచ్ అందుకుంటాన‌ని చెప్ప‌డంతో య‌శ్ వెన‌క్కి త‌గ్గాడు. అయితే.. అనూజ్ డైవ్ చేసినా బంతిని అందుకోలేక‌పోయాడు. అప్ప‌టికి పూర‌న్ స్కోరు 2 ప‌రుగులు మాత్ర‌మే.

ఈ అవ‌కాశాన్ని పూర‌న్ పూర్తిగా స‌ద్వినియోగం చేసుకున్నాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 21 బంతులు ఆడిన పూర‌న్ ఒక్క ఫోర్‌, 5 సిక్స‌ర్లతో 40 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచి జ‌ట్టుకు భారీ స్కోరు అందించాడు. ఒక‌వేళ పూర‌న్ క్యాచ్ ప‌ట్టి ఉంటే.. ల‌క్నో సాధార‌ణ స్కోరుకే ప‌రిమితం అయ్యేది. అటు బ్యాటింగ్‌లోనూ రావ‌త్ 21 బంతులు ఆడి 11 ప‌రుగులే చేశాడు. ఆర్‌సీబీ ఓడిపోవ‌డంతో అనూజ్ రావ‌త్ పై నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది.

IPL 2024 : రెండు మ్యాచ్‌ల‌ను రీ షెడ్యూల్ చేసిన బీసీసీఐ

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 181 ప‌రుగులు చేసింది. డికాక్ (81), పూర‌న్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఆర్‌సీబీ 19.4 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ లోమ్రోర్ (33) రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. దీంతో ఆర్‌సీబీ 28 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.