IND vs AUS : మూడో టెస్టుకు ముందు భారత్‌కు ఊహించని షాక్.. గాయపడిన రిషబ్ పంత్..!
మూడో టెస్టుకు ముందు భారత్‌కు ఊహించని షాక్ తగిలింది.

Rishabh Pant suffers injury scare ahead of crucial Gabba Test
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే.. మూడో టెస్టుకు ముందు భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
అడిలైడ్ టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగియడంతో భారత్ గత రెండు రోజులుగా అడిలైడ్‌లోనే మూడో టెస్టు మ్యాచ్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. రిషబ్ పంత్ గాయపడినట్లు ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ తెలిపింది. త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ హెల్మెన్‌ను తాకినట్లుగా పేర్కొంది. దీంతో పంత్ వెంటనే ప్రాక్టీస్‌ను ఆపివేశాడని, అతడికి వైద్యసాయాన్ని అందించారని తెలిపింది.
అయితే.. పంత్ ఎలాంటి కంకషన్‌ను ఎదుర్కోలేదని నిర్ధారించుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ పక్కనే నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సైతం వెంటనే తమ ప్రాక్టీస్‌ను ఆపి పంత్ వద్దకు వచ్చారని నివేదిక జోడించింది. అయితే.. ఆనందం కలిగించే విషయం ఏమిటంటే కాస్త విరామం తీసుకున్న పంత్ తిరిగి బ్యాటింగ్‌ను మొదలు పెట్టాడని పేర్కొంది. కాగా.. పంత్ గాయంపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గబ్బా హీరో పంత్..
ప్రస్తుత సిరీస్ లో పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 87 పరుగులు మాత్రమే చేశాడు. అయితే.. గబ్బా మైదానంలో పంత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 2021 పర్యటనలో గబ్బా మైదానంలో 89 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. అప్పటి వరకు గబ్బాలో ఒక్క టెస్టు మ్యాచ్ ఓడిపోని ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించాడు.