Riyan Parag : ఈ సీజన్లో తొలిసారి ఓడిపోయిన పంజాబ్.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పంజాబ్ పై విజయం సాధించడం పట్ల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
IPL 2026 Riyan Parag intresting comments after Rajasthan Royals beat Punjab Kings (pic credit@ipl)
- పంజాబ్‌కు ఆర్ఆర్ షాక్
- ఈ సీజన్లో తొలిసారి ఓడిపోయిన పంజాబ్
- రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Riyan Parag : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ షాకిచ్చింది. ఈ సీజన్లో పంజాబ్‌కు తొలి ఓటమిని రుచిని చూపించింది. మంగళవారం న్యూ చండీగడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ పై ఆర్ఆర్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ పై విజయం సాధించడం పట్ల రియాన్ పరాగ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే అద్భుత ప్రదర్శన వల్లే విజయం సాధించామని చెప్పుకొచ్చాడు.
మార్కస్ స్టోయినిస్ (62 నాటౌట్; 22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (59; 44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యశ్ రాజ్ పుంజా రెండు, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ చెరో వికెట్ తీశారు.
డోనోవన్ ఫెరీరా (52 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (51; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) లతో పాటు వైభవ్ సూర్యవంశీ (43 ; 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభమ్ దుబే (31 నాటౌట్; 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడడంతో 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో చహల్ మూడు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ ఓ వికెట్ సాధించాడు.
బ్యాటర్లు ఆ లోటును పూడ్చారు
మ్యాచ్ అనంతరం పంజాబ్ పై విజయం సాధించడం పట్ల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. టోర్నీ ప్రారంభానికి ముందు ఓ జట్టుగా తాము ఏ విషయాల గురించి మాట్లాడుకున్నామో అవన్నీ ఈ మ్యాచ్‌లో అమలు చేశామన్నాడు. ఏదీఏమైనప్పటికి కూడా ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఇంకాస్త తక్కువ పరుగులకే పరిమితం చేయాల్సి ఉందన్నాడు. అయినప్పటికి కూడా ఆ తరువాత తమ బ్యాటర్లు ఆ లోటును పూడ్చారని చెప్పుకొచ్చాడు.
తాము ఈ రోజు 100 శాతం అత్యుత్తమ ఆటను ఆడామన్నాడు. తాము 40 ఓవర్ల పాటు ఉత్తమ ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతామని చెప్పుకొచ్చాడు. బయటి వారికి జట్టు ఆటగాళ్లు, వారి సామర్థ్యాలపై ఆందోళనలు ఉండొచ్చు కానీ తమకు కాదన్నాడు. పూర్తి నమ్మకం ఉందన్నాడు. వికెట్లు కాపాడుకుంటూ సాధించాల్సిన రన్‌రేటును మరీ పెరగనీయకుండా చూసుకోవడమే తమ ప్రణాళిక అని చెప్పుకొచ్చాడు.
వైభవ్, జైస్వాల్ ఎప్పటిలాగానే ఆడారని, వారు తమ పనని సులభం చేశారని తెలిపాడు.అయితే.. మధ్యలో తాము ఛేజింగ్ లో వెనుకబడ్డామని.. శుభమ్ దూబే, డోనోవర్ ఫెరీరా భాగస్వామ్యంతోనే తాము పుంజుకున్నామని చెప్పాడు. వారు పంజాబ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు అని రియాన్ పరాగ్ తెలిపాడు.
