IPL 2023: రియాన్ ప‌రాగ్‌ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న నెటీజ‌న్లు.. వెళ్లి డ్యాన్సులు వేసుకో

రియాన్ ప‌రాగ్‌ను నెటీజ‌న్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. రాజ‌స్థాన్ ఓట‌మికి అత‌డే కార‌ణం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. క్రికెట్ ఆడ‌డం మానేసి చీర్ లీడ‌ర్లతో క‌లిసి డ్యాన్స్‌లు చేసుకోవాల‌ని సూచిస్తున్నారు.

IPL 2023: రియాన్ ప‌రాగ్‌ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న నెటీజ‌న్లు.. వెళ్లి డ్యాన్సులు వేసుకో

Riyan Parag

Updated On : April 20, 2023 / 9:26 PM IST

IPL 2023: జైపూర్‌లోని సువాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదిక‌గా బుధ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 10 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. 155 ప‌రుగుల ఓ మోస్తారు ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక చ‌తికిల‌ప‌డింది. జైశ్వాల్‌, బ‌ట్ల‌ర్‌, శాంస‌న్‌, హిట్ మ‌య‌ర్‌లు వంటి హిట్ల‌ర్లు ఉన్న‌ బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ప్ క‌లిగిన రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 144 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. జైశ్వాల్‌(44), బ‌ట్ల‌ర్‌(40)లు మిన‌హా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. ఎవ్వ‌రి సంగ‌తి ఎలా ఉన్నా స‌రే రాజ‌స్థాన్ ఆల్‌రౌండ‌ర్ రియాన్ ప‌రాగ్‌ను మాత్రం నెటీజ‌న్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. రాజ‌స్థాన్ ఓట‌మికి అత‌డే కార‌ణం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. క్రికెట్ ఆడ‌డం మానేసి చీర్ లీడ‌ర్లతో క‌లిసి డ్యాన్స్‌లు చేసుకోవాల‌ని సూచిస్తున్నారు.

ఏమైందంటే..?

లక్నోతో మ్యాచ్‌లో హెట్‌మ‌య‌ర్ ఔటైన త‌రువాత క్రీజులోకి వ‌చ్చాడు రియాన్ ప‌రాగ్‌. ఆ స‌మ‌యంలో రాజ‌స్థాన్ 29 బంతుల్లో 51 ప‌రుగులు చేయాల్సి ఉంది. అయితే.. రియాన్ చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 12 బంతుల‌ను ఎదుర్కొని కేవ‌లం 15 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తాను ఎదుర్కొన్న మొద‌టి 7 బంతుల్లో కేవ‌లం మూడు ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో ర‌న్‌రేట్ పెరిగిపోయి అవ‌త‌లి ఎండ్‌లో ఉన్న ప‌డిక్క‌ల్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. అప్ప‌టికే వేగంగా ఆడుతున్న ప‌డిక్క‌ల్ మ‌రింత‌ ధాటిగా ఆడ‌బోయి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో రాజ‌స్థాన్ ఓట‌మి ఖాయ‌మైంది. ఆఖ‌ర్లో కూడా ధాటిగా ఆడ‌లేక‌ రాజ‌స్థాన్ ఓట‌మికి కార‌ణమైన రియాన్ ప‌రాగ్‌పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు.

రియాన్‌కు క్రికెట్ ఆడే ఆస‌క్తి లేన‌ట్లుగా ఉంది. ఆఖ‌రి బంతికి సీనియ‌ర్ అయిన అశ్విన్ రెండో ప‌రుగు కోసం ప్ర‌య‌త్నిస్తుంటే రియాన్ మాత్రం తొలి ప‌రుగును కూడా పూర్తి చేయ‌లేదు.

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రియాన్‌ పరాగ్.. మోస్ట్‌ ఇరిటేటింగ్‌ ప్లేయర్ ఆఫ్ ఐపీఎల్‌ హిస్టరీ

నీకు క్రికెట్ అవ‌స‌రం లేదు. వెళ్లి చీర్ గ‌ర్ల్స్‌తో డ్యాన్సులు చేసుకో

ఈ సీజ‌న్‌లో రియాన్ ప‌రాగ్ దారుణంగా విఫ‌లం అవుతున్నాడు. రాజ‌స్థాన్ త‌రుపున ఆడిన ఐదు మ్యాచుల్లో 7, 20, 7, 15* ప‌రుగులు చేశాడు. అయిన‌ప్ప‌టికీ అత‌డికి జ‌ట్టు మేనేజ్‌మెంట్ అండ‌గా ఉంటోంది. త‌న ఆట‌తీరును మార్చుకోవ‌డం లేదు. నిర్ల‌క్ష్యంగా ఆడుతున్నాడు. అత‌డు త‌న ఆట‌తీరుతో కంటే మైదానంలో చేసే చేష్ట‌ల‌తోనే వార్త‌ల్లో నిలుస్తున్నాడు.