యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు: రోహిత్, కోహ్లీ పెద్ద తప్పు చేశారంటూ..

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ సరైన సమయానికి జరిగిందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది

యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు: రోహిత్, కోహ్లీ పెద్ద తప్పు చేశారంటూ..

Updated On : June 13, 2025 / 8:32 PM IST

భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టైస్టులకు వీడ్కోలు పలకడంతో యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. అయితే, ఈ మార్పుపై భారత మాజీ ఫాస్ట్ బౌలర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఒక తొందరపాటు నిర్ణయమని, వారు ఇంకా ఐదేళ్లు ఆడితే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

యోగ్‌రాజ్ సింగ్ ఏమన్నారంటే?
మే నెలలో టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీల నిర్ణయాన్ని యోగ్‌రాజ్ సింగ్ తప్పుబట్టారు. “వాళ్లిద్దరూ ఇంకా ఐదేళ్ల పాటు సులభంగా టెస్ట్ క్రికెట్ ఆడగలరు. వారి అనుభవం జట్టుకు ఎంతో అవసరం. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేంత వరకు వారు ఆగి ఉండాల్సింది. యువ కెప్టెన్‌కు వారి మద్దతు అవసరం. నేను రోహిత్ శర్మకు ఒక సలహా ఇచ్చాను. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు లేచి 20 కిలోమీటర్లు పరిగెత్తితే, అతని ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంటుంది” అని యోగ్‌రాజ్ తెలిపారు.

గిల్ శకం ప్రారంభం: కొత్త కెప్టెన్, కొత్త సవాళ్లు

యోగ్‌రాజ్ అభిప్రాయం ఎలా ఉన్నా, భారత క్రికెట్ ముందుకు సాగుతోంది. శుభ్‌మన్ గిల్ (25) భారత 37వ టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పటౌడీ, సచిన్, కపిల్ దేవ్, ధోనీ తర్వాత అత్యంత పిన్న వయసులో కెప్టెన్ అయిన ఐదో ఆటగాడు గిల్. ఇక వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు.

ఈ యువ జట్టుకు మొదటి అసలైన సవాలు ఇంగ్లాండ్‌ గడ్డపైనే ఎదురుకానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ జూన్ 20న లీడ్స్‌లోని హెడ్డింగ్లీ మైదానంలో ప్రారంభం కానుంది.

సవాల్ ఇదే: అనుభవజ్ఞులైన రోహిత్, కోహ్లీ లేకుండా యువ జట్టు ఇంగ్లాండ్‌లో ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గిల్-పంత్ ధ్వయంపై భారీ బాధ్యత ఉంది.

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ సరైన సమయానికి జరిగిందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇప్పుడు అందరి దృష్టి యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంపైనే ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో ఈ యువ భారత్ టీమ్‌ ఎలా రాణిస్తుందో చూడాలి.