Rohit Sharma : ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కేఎల్ రాహుల్ గురించి ఇలా, వరుణ్ చక్రవర్తి గురించి అలా..
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తరువాత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Rohit Sharma comments after winning Champions Trophy 2025 final
ముచ్చటగా మూడోసారి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు వరుసగా ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం విశేషం. గతేడాది టీ20 ప్రపంచకప్2024 ను అందుకున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం పై రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. ఇది హోం గ్రౌండ్ కాకపోయినప్పటికి కూడా ఫ్యాన్స్ హోండ్ గ్రౌండ్‌గా మార్చేశారని అన్నాడు. వారంతా సంతోషించే ఫలితం దక్కడం సంతృప్తినిచ్చిందన్నాడు. టోర్నీ అసాంతం స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని చెప్పుకొచ్చాడు.
ఇలాంటి పిచ్‌లపై ఆడేటప్పుడు స్పిన్నర్లపై చాలా అంచనాలు ఉంటాయన్నాడు. అయితే.. భారత స్పిన్నర్లు ఎప్పుడు నిరాశపరచలేదన్నాడు. వారి వారి బలాలను అర్థం చేసుకుని ముందుకు సాగినట్లు వివరించాడు. ఈటోర్నీ అసాంతం నిలకడగా బౌలింగ్ చేశారన్నాడు.
ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే.. అతడు ఎంతో ధృడమైన వ్యక్తి అని చెప్పుకొచ్చాడు. ఎంత మాత్రం ఒత్తిడిని దరిచేరనివ్వడని తెలిపాడు. అందుకనే అతడిని మిడిల్ ఆర్డర్ లో ఆడించామని, ప్రశాంతంగా ఉంటూ మ్యాచ్‌ను ముగించాలని కోరుకున్నామన్నాడు. అతడు ఆడడంతో పాటు మిగిలిన ఆటగాళ్లు కొంచెం స్వేచ్ఛగా ఆడేలా అండగా నిలుస్తాడని చెప్పుకొచ్చాడు. అందుకు ఉదాహరణ హార్థిక్ పాండ్య భారీ షాట్లేనని తెలిపాడు.
ఇక వరుణ్ చక్రవర్తిలో ఏదో వైవిధ్యం ఉందన్నాడు. ఈ తరహా పిచ్‌లపై అతడు బ్యాటర్లకు డేంజరస్‌గా మారుతాడు. అతడి బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగాలని ప్రయత్నించి బ్యాటర్లు ఔట్ అవుతారు. ఈ ఆలోచనతోనే అతడిని జట్టులోకి తీసుకున్నామన్నాడు. టోర్నమెంట్ ప్రారంభంలో అతడికి అవకాశం ఇవ్వలేదని, అయితే.. కివీస్ పై ఆడినప్పుడు ఐదు వికెట్లు తీశాడు. అప్పుడు అతడి సామర్థ్యం మాకు అర్థమైందని చెప్పాడు. దీంతో అతడిని జట్టులో కొనసాగించినట్లు తెలిపాడు. సపోర్ట్ స్టాఫ్ మద్దుతు అద్భుతం అని, బయటకు కనిపించకపోయినా విజయాల్లో వారి పాత్ర కీలకం అని రోహిత్ శర్మ అన్నాడు.