Champions Trophy 2025 Prize Money : ల‌క్కంటే టీమ్ఇండియాదే.. భార‌త్‌ పై కోట్ల వ‌ర్షం.. ఏ జ‌ట్టుకు ఎంత ప్రైజ్‌మ‌నీ అంటే?

ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టుకు ఎంత మొత్తం ప్రైజ్‌మ‌నీగా ల‌భించిందంటే..

Champions Trophy 2025 Prize Money : ల‌క్కంటే టీమ్ఇండియాదే.. భార‌త్‌ పై కోట్ల వ‌ర్షం.. ఏ జ‌ట్టుకు ఎంత ప్రైజ్‌మ‌నీ అంటే?

PIC CREDIT @ BCCI TWITTER

Updated On : March 10, 2025 / 6:19 AM IST

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా భార‌త్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. దీంతో ముచ్చ‌ట‌గా మూడోసారి ఛాంపియ‌న్స్ ట్రోఫీని ముద్దాడింది. ఈ క్ర‌మంలో అత్య‌ధిక సార్లు ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిలిచిన జ‌ట్టుగా భార‌త్ చ‌రిత్ర సృష్టించింది.

ప్రైజ్‌మ‌నీ ఎలాగంటే..?

ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు ప్రైజ్‌మ‌నీగా 2.24 మిలియ‌న్ల యూఎస్ డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో రూ.19.52 కోట్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు 1.12 మిలియ‌న్ల డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో రూ.9.76 కోట్లు ల‌భించ‌నుంది. ఇక సెమీస్‌లో ఓడిన ఒక్కొ జట్టుకు రూ.4.88 కోట్లు.. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జ‌ట్ల‌కు ఒక్కొక్క‌రికి రూ.3.05 కోట్లు, ఏడు, ఎనిమిదో స్థానంలో ఉన్న జ‌ట్లు రూ.1.22 కోట్లు అంద‌నుంది.

IND vs NZ : ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా భార‌త్‌.. ఫైన‌ల్‌లో న్యూజిలాండ్ పై ఘ‌న విజ‌యం.. ముచ్చ‌ట‌గా మూడోసారి..

అంతే కాదండోయ్.. ఎనిమిది జ‌ట్లు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడినందుకు అద‌నంగా 1,25000 డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ.1.08 కోట్లు అందించ‌నున్న‌ట్లు ఐసీసీ తెలిపింది. ఇక గ్రూప్ స్టేజీలో ఒక్కొ మ్యాచ్ విజ‌యానికి 34,000 డాల‌ర్లు అంటే భార‌త కరెన్సీలో సుమారు రూ.29 లక్ష‌లు ల‌భించ‌నున్నాయి.

విజేత‌గా నిలిచిన భార‌త్‌కు ఎంతంటే?
అంటే ఈ లెక్క‌న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో విజేత‌గా నిలిచిన భార‌త్ పై కోట్ల వ‌ర్షం కురిసింది. విజేత‌గా నిల‌వ‌డంతో రూ.19.52 కోట్లు ద‌క్క‌నుంది. ఇక భార‌త్ గ్రూప్ స్టేజీలో మూడు మ్యాచ్‌ల్లో భార‌త్ గెలిచింది. ఒక్కో విజ‌యానికి రూ.29 ల‌క్ష‌ల చొప్పున మొత్తం రూ.88లక్ష‌లు, ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడినందుకు ఐసీసీ బోన‌స్‌గా ఒక్కొ జ‌ట్టుకు రూ.1.08 కోట్లు ఇవ్వ‌నుంది. అంటే రూ.19.52 కోట్లు+ రూ.88లక్ష‌లు+రూ.1.08కోట్లు మొత్తంగా రూ.21.50 కోట్ల‌ను భార‌త్ ప్రైజ్‌మ‌నీగా గెలుచుకుంది.

ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు ప్రైజ్‌మ‌నీ రూ.9.76 కోట్లతో పాటు గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచ్‌లు గెల‌వ‌డంతో రూ.58ల‌క్ష‌లు, చాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడినందుకు ఐసీసీ ఇస్తున్న బోన‌స్‌ రూ.1.08 కోట్లు క‌లుపుకుంటే మొత్తంగా రూ.11.43 కోట్ల మొత్తాన్ని పొందింది.

IND vs NZ : నేను అక్క‌డ ఉంటే ఇలా మిస్ చేసే వాడిని కాదు.. రిష‌బ్ పంత్ రియాక్ష‌న్ వైర‌ల్‌..

సెమీస్‌లో ఓడిన ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల‌కు ఎంతంటే..?

ఇక రెండో సెమీస్‌లో ఓడిన ద‌క్షిణాఫ్రికాకు రూ.4.88 కోట్లు అంద‌నుంది. దీంతో పాటు గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచ్‌ల్లో గెల‌వ‌డంతో రూ.58ల‌క్ష‌లు, ఐసీసీ బోన‌స్ రూ.1.08 కోట్లు మొత్తంగా రూ.6.54 కోట్లు స‌పారీకు ద‌క్కింది. ఇక మొద‌టి సెమీస్‌లో ఓడిన ఆస్ట్రేలియాకు రూ.4.88 కోట్ల‌తో పాటు గ్రూప్ స్టేజీలో ఒక్క మ్యాచే గెల‌వ‌డంతో రూ.29ల‌క్ష‌లు, ఐసీసీ బోన‌స్ రూ.1.08 కోట్ల‌తో క‌లిపి రూ.6.25 కోట్లు ల‌భించింది.

గ్రూప్ స్టేజీలోనే నిష్ర్క‌మించిన జ‌ట్ల‌కు ఎంతంటే?

ఐదో స్థానంలో అఫ్గానిస్థాన్ నిలిచింది. దీంతో రూ.3.05 కోట్ల‌తో పాటు గ్రూప్ స్టేజీలో ఆ జ‌ట్టు ఒక మ్యాచ్‌లో గెల‌వ‌డంతో అద‌నంగా మ‌రో రూ.29ల‌క్ష‌లు, ఐసీసీ బోన‌స్ రూ.1.08 కోట్లు క‌లుపుకుంటే మొత్తంగా అఫ్గానిస్థాన్ రూ.4.42 కోట్ల‌ను గెలుచుకుంది. ఆరో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌కు రూ.3.05 కోట్ల‌తో పాటు ఐసీసీ బోన‌స్ రూ.1.08 కోట్లు క‌లుపుకుంటే మొత్తంగా రూ.4.13 కోట్లు అందాయి.

ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి రెండు స్థానాల్లో నిలిచిన ఆతిథ్య పాక్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు వ‌ట్టి చేతుల‌తో వెళ్ల‌డం లేదు. చెరో రూ.1.22 కోట్లతో పాటు ఐసీసీ హామీ మొత్తం క‌లుపుకుంటే రూ.2.30 కోట్ల ప్రైజ్‌మ‌నీ ల‌భించాయి.

IND vs NZ : కుల్దీప్ దెబ్బ‌కు ర‌చిన్ ర‌వీంద్ర ఫ్యూజులు ఔట్‌.. బాల్ ఎలా తిరిగిందో చూశారా.. వీడియో వైర‌ల్‌

మొత్తంగా ప్రైజ్‌మ‌నీ వివ‌రాలు ఇలా..
భార‌త్ – రూ.21.50 కోట్లు
న్యూజిలాండ్ – రూ. 11.43 కోట్ల
ద‌క్షిణాఫ్రికా – రూ.6.54 కోట్లు
ఆస్ట్రేలియా – రూ.6.25 కోట్లు
అఫ్గానిస్థాన్ – రూ.4.42 కోట్లు
బంగ్లాదేశ్ – రూ.3.05 కోట్లు
పాకిస్థాన్ – రూ.2.30 కోట్లు
ఇంగ్లాండ్ – రూ.2.30 కోట్లు