IND vs NZ : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్.. ఫైనల్‌లో న్యూజిలాండ్ పై ఘన విజయం.. ముచ్చటగా మూడోసారి..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి ముద్దాడింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీని అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. గతంలో 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా, 2013లో ధోని నాయకత్వంలో గెలిచింది.
252 లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (76; 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. శ్రేయస్ అయ్యర్ (48; 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (34 నాటౌట్; 33 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) లు రాణించారు. శుభ్‌మన్ గిల్ (31; 50 బంతుల్లో 1 సిక్స్), అక్షర్ పటేల్ (29; 40 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)లు ఫర్వాలేదనిపించారు. విరాట్ కోహ్లీ (1) విఫలం అయ్యాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్, బ్రాస్‌వేల్ లు చెరో రెండు వికెట్లు తీయగా, కైల్ జేమీసన్, రచిన్ రవీంద్ర లు తలా ఓ వికెట్ తీశారు.
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🇮🇳🏆 🏆 🏆
The Rohit Sharma-led #TeamIndia are ICC #ChampionsTrophy 2025 𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎 👏 👏
Take A Bow! 🙌 🙌#INDvNZ | #Final | @ImRo45 pic.twitter.com/ey2llSOYdG
— BCCI (@BCCI) March 9, 2025
లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్‌లు శుభారంభం ఇచ్చారు. రోహిత్ శర్మ కివీస్ బౌలర్ల పై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గిల్ ఆరంభం నుంచి క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. ఇక కుదురుకున్నాడు అనుకునే సమయంలో మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. గిల్-రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ విఫలం కాగా స్వల్ప వ్యవధిలోనే రోహిత్ శర్మ ఔట్ కావడంతో భారత్ 122 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. నాలుగో వికెట్‌కు 61పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తరువాత శ్రేయస్ అయ్యర్ ఔట్ అయ్యాడు. మరికాసేపటికే ఐదో వికెట్‌గా అక్షర్ పటేల్ జట్టు స్కోరు 203 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు.
అయితే.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా(18)లు భారత్‌ను ఆదుకున్నారు. ఆరో వికెట్ కు 38 పరుగులు జోడించిన హార్దిక్ ఔట్ అయ్యాడు. అయితే అప్పటికే భారత్ విజయతీరాలకు చేరడంతో చింతించాల్సిన పని లేకుండా పోయింది. జడేజా(9 నాటౌట్)తో కలిసి కేఎల్ రాహుల్ జట్టుకు విజయాన్ని అందించాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (63; 101 బంతుల్లో 3 ఫోర్లు), బ్రాస్‌వెల్ (53 నాటౌట్; 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు బాదారు. టీమ్ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, షమీలు తలా ఓ వికెట్ పడగొట్టారు.