మరో రికార్డుకు 9 పరుగుల దూరంలో రోహిత్ శర్మ

టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు 9 పరుగుల దూరంలో ఉన్నాడు. 2019లో ఓపెనర్ బ్యాట్స్ మెన్‌గా రోహిత్ ఇప్పటివరకూ 2,379 పరుగులు చేశాడు. రోహిత్ మరో 9 పరుగులు జోడిస్తే.. శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య పేరిట ఉన్న 22ఏళ్ల రికార్డును బ్రేక్ చేయనున్నాడు. 1997లో జయసూర్య 2,387 పరుగులతో ఈ ఫీట్ సాధించగా, రోహిత్ మరో 8 పరుగులు చేస్తే చాలు జయసూర్య రికార్డును సమం చేస్తాడు.
ప్రస్తుతం.. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు సిరీస్ ల వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలి వన్డేలో వెస్టిండీస్ గెలవగా, రెండో వన్డేలో భారత్ గెలిచి సిరీస్ సమం చేసింది. ఆఖరిదైన మూడో వన్డేలో సిరీస్ సొంతం చేసుకునేందుకు ఇరుజట్లు పోటీపడుతున్నాయి. రెండో వన్డేలో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ తొలి వికెట్ కు 200 పరుగులు జోడించడంతో భారత్ విజయం దిశగా దూసుకెళ్లింది.
2019లో మంచి ఫాం మీదన్న రోహిత్.. డబుల్ సెంచరీలతో రెచ్చిపోయాడు. మూడో వన్డేలో రోహిత్ మరో 9 పరుగులు సాధించడం ద్వారా జయసూర్యను వెనక్కి నెట్టేసి ఆ రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. అంతేకాదు.. మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్ గా రోహిత్ మరో రికార్డును క్రియేట్ చేస్తాడు.