ఇప్పటికే ఖరారు.. రోహిత్, కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారు.. ఎలాగంటే: సునీల్ గవాస్కర్

“ప్రపంచకప్ ఇండియా జట్టులో వారి పేర్లను నేరుగా రాసేయొచ్చు” అని సునీల్ గవాస్కర్ చెప్పారు.

ఇప్పటికే ఖరారు.. రోహిత్, కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారు.. ఎలాగంటే: సునీల్ గవాస్కర్

Updated On : October 26, 2025 / 9:33 PM IST

Sunil Gavaskar: భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ పర్ఫార్మన్స్‌తో ఇప్పటికే 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకున్నారని టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లోనూ డకౌట్ అయిన కోహ్లీ.. మూడో వన్డేలో అజేయంగా 74 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఇక రోహిత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. (Sunil Gavaskar)

ఈ ఇద్దరు స్టార్‌లు అద్భుత భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాపై మూడో మ్యాచులో 9 వికెట్ల తేడాతో భారత జట్టుకు విజయం అందించారు. రోహిత్, విరాట్ ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆడటం ద్వారానే ప్రపంచకప్ ఆడే ఉద్దేశాన్ని స్పష్టంగా కనబర్చారని సునీల్ గవాస్కర్ అన్నారు.

Also Read: Louvre: ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో.. పిచ్చెక్కిస్తున్నాడు.. ఎవడ్రా నువ్వు అసలు..

“ఆస్ట్రేలియా పర్యటనకు వారు సిద్ధమైన క్షణమే 2027 ప్రపంచకప్‌లో ఆడతామన్న సంకేతమిచ్చారు. ఇప్పటి నుంచి 2027 వరకూ వారు మ్యాచుల్లో రన్స్‌ బాగా చేసినా, చేయకపోయినా.. వారు ఆడేందుకు సిద్ధంగా ఉంటే చాలు వారి ప్రతిభ, అనుభవం దృష్ట్యా జట్టులోకి కచ్చితంగా తీసుకుంటారు. ఇలాంటి ఫామ్‌లో ఉంటే 2027 ప్రపంచకప్ ఇండియా జట్టులో వారి పేర్లను నేరుగా రాసేయొచ్చు” అని సునీల్ గవాస్కర్ చెప్పారు.

ప్రస్తుతం రోహిత్, కోహ్లీ ఇద్దరూ టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయినప్పటికీ.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం ఆడుతున్నారు. వారి కెరీర్‌పై ఇటీవల పెద్ద చర్చ సాగుతోంది.

శనివారం ఈ ఇద్దరు లెజెండరీ బ్యాట్స్‌మన్ మళ్లీ కలసి భారత్‌ను సిరీస్ వైట్‌వాష్ నుంచి రక్షించారు. అజేయమైన 168 పరుగుల భాగస్వామ్యంతో భారత జట్టుకు 9 వికెట్లతో విజయాన్ని అందించారు. మూడో మ్యాచులో రోహిత్ 121 పరుగులు, కోహ్లీ 74 పరుగులు చేశారు.