Louvre: ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో.. పిచ్చెక్కిస్తున్నాడు.. ఎవడ్రా నువ్వు అసలు..
స్టైలిష్ దుస్తులు ధరించిన ఆ యువకుడు అంతే స్టైల్‌గా నడుస్తుండడం అందరినీ ఆకర్షిస్తోంది. అతడు కోటు, టై, ఫెడోరా ధరించి కనపడ్డాడు.
Louvre: ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో ఇటీవల ఆభరణాల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రతిరోజు దాదాపు 30 వేల మంది సందర్శించే ఈ ఐకానిక్ మ్యూజియంలోకి తెల్లవారుజామున దొంగలు హైడ్రాలిక్ ల్యాడెర్‌ను ఉపయోగించి, మ్యూజియంలోకి ప్రవేశించి ఎనిమిది అమూల్యమైన ఆభరణాలను దోచుకున్నారని ఇప్పటికే అధికారులు తెలిపారు.
లౌవ్రేలో ఆభరణాల దోపిడీ జరిగిన వేళ పారిస్‌లోని అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ తిబో కామస్ తీసిన ఓ ఫొటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. చక్కగా ముస్తాబైన ఓ యువకుడి ఫొటోను ఇందులో చూడొచ్చు. ఆ గుర్తు తెలియని యువకుడు యూనిఫామ్ ధరించిన ఫ్రెంచ్ పోలీస్ అధికారుల పక్కగా నడుస్తూ కనపడ్డాడు.

స్టైలిష్ దుస్తులు ధరించిన ఆ యువకుడు అంతే స్టైల్‌గా నడుస్తుండడం అందరినీ ఆకర్షిస్తోంది. అతడు కోటు, టై, ఫెడోరా ధరించి కనపడ్డాడు. ఆభరణాలను దొంగలు దోపిడీ చేసిన తర్వాత పారిస్‌లోని లౌవ్రే మ్యూజియాన్ని పోలీసులు మూసివేస్తున్న సమయంలో ఆ అందమైన యువకుడు అక్కడ ఉన్నాడు. యూనిఫామ్ ధరించిన పోలీసు అధికారుల ముందు నుంచే నడుచుకుంటూ వెళుతున్నట్లు ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది.
Also Read: అందుకే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెత్తగా ఆడుతున్నాడు.. మాజీ క్రికెటర్లు ఏమన్నారంటే?
ఈ ఫొటోను ఫొటోగ్రాఫర్ తిబో కామస్ సాధారణంగానే తీశాడు. లౌవ్రే మ్యూజియాన్ని పోలీసులు మూసివేస్తున్నారన్న వార్త కోసం ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించాడు. అందులో స్టైలిష్‌గా కనపడుతున్న ఈ యువకుడు ఎవరన్న విషయం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
ఆ యువకుడి గురించి సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యక్తిని ఫ్రెంచ్ డిటెక్టివ్‌గా కొందరు పేర్కొంటున్నారు.
“1940 దశకంలో డిటెక్టివ్ సినిమాల శైలిలో కనిపిస్తున్న ఈ వ్యక్తి నిజమైన ఫ్రెంచ్ పోలీస్ డిటెక్టివ్, ఆభరణాల దోపిడీ దర్యాప్తు చేస్తున్నాడు” అని ఓ యూజర్ పేర్కొన్నాడు.
అయితే, ఈ ఫొటో తీసిన కామస్ మాత్రం.. ఆ యువకుడు డిటెక్టివ్ అన్నందుకు ఆధారాలు ఏమీ లేవని, మ్యూజియం నుంచి ప్రజలను బయటకు పంపుతున్న సమయంలో ఆ యువకుడు కూడా వెళ్లిపోయాడని అన్నారు. “అతను నా ముందు కనపడ్డాడు, నేను చూశాను, ఫొటో తీసాను” అని కామస్ అన్నాడు.
