CSK vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓటమి.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ వింత వ్యాఖ్యలు.. సంతోషంగా ఉంది..
ఆర్‌సీబీ చేతిలో మ్యాచ్ ఓడిపోయిన తరువాత సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

pic credit @mufaddal_vohra
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమి అనంతరం ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అసాధారణ ప్రకటన చేశాడు. చెన్నై భారీ తేడాతో కాకుండా కేవలం 50 పరుగుల తేడాతో ఓడిపోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.
కీలకమైన క్యాచ్‌లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అన్నాడు. బౌలింగ్‌లో అదనంగా 20 పరుగులు ఇవ్వడం విజయావకాశాలను దెబ్బతీసిందని అన్నాడు. అదే సమయంలో బ్యాటింగ్ చేసేటప్పుడు పవర్ ప్లేలో వేగంగా ఆడలేకపోయామని, అందుకు తగిలిన మూల్యం చెల్లించుకున్నామని చెప్పుకొచ్చాడు.
IPL 2025: ధోనీతోనే ఆటలా.. సూర్య బాటలో సాల్ట్.. అంతా రెప్పపాటులోనే జరిగిపోయింది.. వీడియో వైరల్
ఓటమి అనంతరం రుతురాజ్ మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్పాలంటే ఈ వికెట్ పై 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టం అని చెప్పాడు. ఫీల్డింగ్‌లో ఈ రోజు తమకు ఓ బ్యాడ్ డే అని అన్నాడు. ఇక 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే కాస్త విభిన్నంగా బ్యాటింగ్ చేయాలన్నాడు. కాస్త టైమ్ తీసుకుని ఆడవచ్చునని చెప్పాడు. అయితే.. ఈ పిచ్ పై 170 కంటే అదనంగా మరో 20 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు పవర్ ప్లేలో చాలా దూకుడుగా ఆడాల్సి ఉంటుందని తెలిపాడు.
‘ఎందుకంటే బంతి పాతబడితే ఈ పిచ్ పై బ్యాటింగ్‌కు కష్టమవుతుంది. అందువల్ల పవర్ ప్లేలో దూకుడుగా ఆడాల్సి ఉంది. ఇక రాహుల్ త్రిపాఠి, నేను మా షాట్స్ నమ్ముకొని ఆడాము. అయితే.. కొన్ని సార్లు ఇది వర్కౌట్ అవుతుంది. మరికొన్ని సార్లు కావు. 170 కంటే అదనంగా మరో 20 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మీరు కాస్త దూకుడుగానే ఆడాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే షాట్స్ ఆడాం. అయితే.. అది వర్కౌట్ కాలేదు. ఈమ్యాచ్‌లో ఓడిపోయినా సంతోషంగానే ఉంది. భారీ తేడాతో ఓడిపోలేదు. కేవలం 50 పరుగులతో ఓడిపోవడం ఊరట నిచ్చింది.’ అని రుతురాజ్ అన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ వికెట్లు పడినా తమ అప్రోచ్‌ను కొనసాగించిందన్నాడు. కీలక సమయంలో తాము క్యాచ్‌లను మిస్ చేశామని, క్యాచ్ వదిలిన ప్రతీసారి సిక్స్ లేదా బౌండరీ వచ్చిందన్నాడు. ఇక ఇప్పుడు తదుపరి మ్యాచ్ పై దృష్టి సారించాల్సి ఉందన్నాడు. గౌహతిలో ఆడనున్న ఆ మ్యాచ్ కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నాడు.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకు మాత్రమే పరిమితమైంది.