కెరీర్ లో 7వేల వికెట్లు: రిటైర్మెంట్ ప్రకటించిన 85ఏళ్ల క్రికెటర్

  • Published By: vamsi ,Published On : August 28, 2019 / 01:38 AM IST
కెరీర్ లో 7వేల వికెట్లు: రిటైర్మెంట్ ప్రకటించిన 85ఏళ్ల క్రికెటర్

Updated On : August 28, 2019 / 1:38 AM IST

వివ్‌ రిచర్డ్స్‌, గ్యారీ సోబర్స్‌, జోయెల్‌ గార్నర్‌, ఫ్రాంక్‌ వోరెల్‌ వంటి వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడిన క్రికెటర్ సెసిల్‌ రైట్‌ క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. రెండు వారాల్లో 85వ వసంతంలోకి అడుగు పెడుతున్న క్రమంలోనే ఇక క్రికెట్ కు దూరం అవుతున్నట్లు ప్రకటించారు.

ఫాస్ట్‌ బౌలరైన సెసిల్‌ రైట్‌ వెస్టిండీస్ కు చెందిన వ్యక్తి కాగా.. అక్కడ బార్బడోస్ తో మ్యాచ్‌లో జమైకాకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతర కాలంలో 1959లో ఇంగ్లాండ్‌ వెళ్లి సెంట్రల్‌ లాంకాషైర్ టీమ్ తరపున ఆడాడు. ఎనిద్ అనే మహిళని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు.

సెసిల్ రైట్ తన 85 ఏళ్ల జీవితంలో 60 ఏళ్లకుపైగా జీవితాన్ని క్రికెట్ కే అంకితం చేశాడు. తన కెరీర్ లో మొత్తంగా 7 వేలకు పైగా వికెట్లు తీశాడు. సగటున ప్రతీ 27 బంతులకు ఓ వికెట్ చొప్పున ఐదు సీజన్లలో 538 వికెట్లు తీసిన చరిత్ర రైట్ కు మాత్రమే ఉంది. క్రికెట్ కెరీర్ ని ఇంత సుదీర్ఘకాలం నడిపించిన వ్యక్తి కూడా రైట్ కావడం విశేషం.

ఈ విషయమై స్పందించిన రైట్ “అంతా సవ్యంగా సాగుతోంది. ఇంత సుదీర్ఘంగా ఆడటానికి కారణమేంటో నాకు తెలుసు. అవేంటో మీకు చెప్పను. నాకు నచ్చిన ప్రతి ఆహారాన్ని తినేవాడిని. ఎక్కువగా తాగను. ఎప్పుడో ఓసారి ఒక బీర్‌ సేవిస్తాను. నేనెప్పుడు ఫిట్‌గా ఉంటాను. ఈ మధ్యన నా వయసును సాకుగా చూపి సాధనకు వెళ్లడం లేదు. ఇంట్లో కూర్చొని టీవీ చూడటం నాకిష్టం ఉండదు. బయటకెళ్లి ఏదో ఓ పని చేయడం ఇష్టం” అంటూ చెప్పుకొచ్చారు.

వచ్చే నెల(సెప్టెంబర్ 7వ తేదీన)  పెన్నీ లీగ్‌లో అప్పర్‌మిల్ జట్టు తరపున రైట్ తన చివరి క్రికెట్ మ్యాచ్ ఆడనున్నాడు.