రాజీనామా ప్రకటించిన షకీబ్ అల్ హసన్

రాజీనామా ప్రకటించిన షకీబ్ అల్ హసన్

Updated On : October 30, 2019 / 11:19 AM IST

బుకీ సంప్రదించాడని ఒప్పుకోవడంతో షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ లో ఆడొద్దంటూ రెండేళ్ల నిషేదం పడింది. దీంతో పాటు ఎంసీసీ(మార్లిబోన్ క్రికెట్ క్లబ్) ప్రపంచ క్రికెట్ కమిటీ నుంచి తానే తప్పుకుంటున్నట్లు రాజీనామా ప్రకటించాడు. అక్టోబర్ 2017లో ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీలో చేరిన షకీబ్ ఉల్ హాసన్ సిడ్నీ, బెంగళూరు వేదికగా జరిగిన రెండు మీటింగ్‌లకు హాజరయ్యాడు. ఇందులో అంతర్జాతీయ క్రికెట్‌లోని ప్రస్తుత, మాజీ అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు అంపైర్లు ఉంటారు. క్రికెట్‌లో సమస్యలపై చర్చించడానికి ఏటా రెండుసార్లు ఈ కమిటీ మీటింగ్ జరుగుతుంది. 

ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని ఐసీసీకి షకీబ్ తెలియజేయలేదు. ఆ తర్వాత జరిగిన విచారణలో విషయాన్ని బయటపెట్టాడు. ఫలితంగా అతనిపై రెండేళ్ల పాటు నిషేదం విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. 2017 బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌) సందర్భంగా నవంబర్‌లో తొలిసారి భారత బుకీ దీపక్ అగర్వాల్ షకీబ్‌ను సంప్రదించాడు. ఆ తర్వాత 2018 జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో ఐపీఎల్లో మరోసారి సంప్రదించాడు.

షకీబ్‌ వచ్చే ఐపీఎల్‌తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ ప్రస్తుత చైర్మన్ మైక్ గాటింగ్ ఇలా మాట్లాడాడు. ‘కమిటీ నుంచి షకీబ్‌ను కోల్పోయినందుకు మమ్మల్ని క్షమించాలి. రెండేళ్లుగా అద్భుతమైన కృషి చేస్తున్నాడు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ సంరక్షకులుగా అతని రాజీనామాకు మద్దతు ఇవ్వడంతో పాటు ఇది సరైన నిర్ణయం అని నమ్ముతున్నాం’ అని అన్నాడు.