Shubman Gill : ఆ ఒక్కటే మా కొంపముంచింది.. లేదంటేనా.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కామెంట్స్..
పేలవ ఫీల్డింగ్ కారణంగానే తాము గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill ) తెలిపాడు.
Shubman Gill comments after GT lost Match to RCB in Qualifier 1 in IPL 2026 (pic credit @ipl)
- క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓటమి
- గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కామెంట్స్
- ఫీల్డింగే మా కొంపముంచింది
Shubman Gill : పేలవ ఫీల్డింగ్ కారణంగానే తాము గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌లో తొలి 12 నుంచి 13 ఓవర్ల పాటు ఆధిపత్యం ప్రదర్శించామన్నాడు. అయితే.. క్యాచ్‌లను వదిలేయడంతో భారీ మూల్యం చెల్లించుకున్నామని తెలిపాడు. మంగళవారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 92 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ రజత్ పాటిదార్ (93 నాటౌట్; 33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ (43 ;25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్). కృనాల్ పాండ్యా (43; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ, జేసన్ హోల్డర్ చెరో రెండు, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశాడు.
ఆ తరువాత 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో రాహుల్ తెవాటియా (68; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో జాకఫ్ డఫీ మూడు, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టారు. జోష్ హేజిల్‌వుడ్ ఓ వికెట్ తీశాడు.
పేలవ ఫీల్డింగ్‌తో..
ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. పిచ్ ప్రవర్తించిన తీరును చూసి ఆశ్చర్యపోయారా? అనే ప్రశ్న ఎదురుకాగా అలాంటిది ఏమీ లేదన్నాడు. వాస్తవం చెప్పాలంటే మేము ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 12 నుంచి 13 ఓవర్ల వరకు బాగానే ఆడామని అన్నాడు. అయితే.. పేలవ ఫీల్డింగ్ తమ కొంపముంచిందన్నాడు. కొన్ని క్యాచ్‌లు మిస్ చేయడంతో పాటు గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదన్నాడు.
ఇక ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నట్లు తెలిపాడు. ఈ ఓటమిని సాధ్యమైనంత త్వరగా మరిచిపోతామన్నాడు. మొహాలీ వేదికగా జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్ పై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. నిజం చెప్పాలంటే ఫీల్డింగ్ గురించి టీమ్ మీటింగ్‌లో, ప్రాక్టీస్ సెషన్లలో కూడా చర్చిస్తామని తెలిపాడు. అయితే.. ఈ రోజు తమకు కలిసి రాలేదన్నాడు.
ఇక భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు మంచి ఆరంభాలు లభించడం ముఖ్యం అని అన్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పరుగులు రాబడితే.. ఈ మైదానంలో ఎంతటి లక్ష్యాన్ని అయినా ఛేదించవచ్చునని తెలిపాడు. ఔట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉందన్నాడు. ఇక సాయి సుదర్శన్ హిట్ వికెట్‌గా ఔట్ కావడం తమ దురదృష్టం అని చెప్పుకొచ్చాడు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయన్నాడు.
