Shubman Gill : రోహిత్ శర్మ చివరి మ్యాచ్ ఆడేశాడా? గిల్ కామెంట్స్ వైరల్.. ఎంతో సంతోషంగా ఉంది
మ్యాచ్ అనంతరం రోహిత్ భవిష్యత్తుకు సంబంధించిన మీడియా కథనాల గురించి భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను (Shubman Gill) అడగ్గా ఇలా స్పందించాడు.
Shubman Gill speak About Rohit Sharmas Last ODI Buzz
Shubman Gill : ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ప్రతిష్టాత్మక మైదానంలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ గా రికార్డులకు ఎక్కాడు. వన్డేల్లో ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు, ఈ శతకం కాకుండా 33 సెంచరీలు చేశాడు. అయినప్పటికి కూడా లార్డ్స్ వేదికగా చేసిన శతకమే హిట్‌మ్యాన్ కెరీర్లో ఎంతో ముఖ్యమైన సెంచరీ.
గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు పేలవ ఫామ్‌తో సతమతమవుతుంటే మరోవైపు వన్డే ప్రపంచకప్ 2027 సెలక్టర్ల ప్రణాళికల్లో అతడు లేడని, ఆదివారం నాటి మ్యాచే అతడి అంతర్జాతీయ కెరీర్లో చివరిది అని ప్రచారం సాగింది.
వీటి అన్నింటి మధ్య తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో హిట్‌మ్యాన్ ఆదివారం లార్డ్స్ మైదానంలో బరిలోకి దిగాడు. భారీ లక్ష్యం ఎదుట నిలిచినప్పటికి కూడా ఆరంభంలో పిచ్, పరిస్థితులను గౌరవించాడు. క్రీజులో కుదురుకున్నాక తనదైన శైలిలో షాట్లు కొడుతూ 84 బంతుల్లో సెంచరీ సాధించాడు. 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ 138 పరుగులతో రాణించినప్పటికి కూడా 27 పరుగుల తేడాతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
సెంచరీ చేసినప్పుడు గానీ, ఆ తరువాత ఔట్ అయి పెవిలియన్‌కు వెలుతున్న సమయంలో మైదానంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవెషన్ ఇచ్చినప్పుడు గానీ హిట్‌మ్యాన్ పెద్దగా సంబురాలు చేసుకోకపోవడం గమనార్హం.
ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ భవిష్యత్తుకు సంబంధించిన మీడియా కథనాల గురించి భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను అడగ్గా ఇలా స్పందించాడు. ఇదే తన చివరి మ్యాచ్ అని రోహిత్ మాకు ఏమీ చెప్పలేదు. అదంతా మీడియాలోనే జరుగుతుంది. అని అన్నాడు.
సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీల గురించి మాట్లాడుతూ.. ఆ ఇద్దరు ఇన్నేళ్లుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చాలా బాగా రాణించారు. ఇక ఈ రోజు రోహిత్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. అతడు 140 పరుగులు చేయడం నాకు చాలా చాలా సంతోషాన్నిచ్చింది. చివరిలో వికెట్ కాస్త నెమ్మదించింది. అన్ని పరుగులు చేయడం అంత సులభం కాదు. కానీ అతను బ్యాటింగ్ చేసిన విధానం చూడటానికి నిజంగా ఒక విందులా అనిపించింది. అని గిల్ చెప్పాడు.
