SA vs SL : వందేళ్ల రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక.. 83 బంతుల్లోనే..
దక్షిణాఫ్రికా పర్యటనలో శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును నమోదు చేసింది

Sri Lanka bowled out for 42 by South Africa their lowest Test total
దక్షిణాఫ్రికా పర్యటనలో శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లలో 42 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్ మార్కో జాన్సెన్ ఏడు వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. కొయెట్జీ రెండు వికెట్లు తీయగా, రబాడ ఓ వికెట్ సాధించాడు.
గత వందేళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 83 బంతుల్లో ఓ జట్టు ఆలౌట్ కావడం ఇదే తొలి సారి. గతంలో 1924లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 75 పరుగులకే ఆలౌటైంది. కాగా.. టెస్టు క్రికెట్‌లో లంకకు ఇదే అత్యల్ప స్కోరు. గతంలో 1994లో పాకిస్థాన్ పై 71 పరుగులకు ఆలౌటైంది.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది. సపారీలను తక్కువ స్కోరుకు పరిమితం చేశామన్న ఆనందం లంకకు కాసేపు కూడా లేకుండా పోయింది. మార్కో జాన్సెన్ ధాటికి ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ దశలో 32/5తో కాస్త కోలుకున్నట్లుగానే కనిపించినా.. మరో 10 పరుగులకే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది.
లంక బ్యాటర్లలో అయిదుగురు డకౌట్లు అయ్యారు. కమిందు మెండిస్ (13), లహిరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. దీంతో దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ 149 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమాయానికి రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా(24), స్టబ్స్ (17) లు క్రీజులో ఉన్నారు.
SOUTH AFRICA RATTLED SRI LANKA FOR 42. 🤯 pic.twitter.com/rPMZ28OKGr
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 28, 2024