Sunil Gavaskar bluntly tells Virat Kohli to keep control like Sachin Tendulkar
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఊసురుమనిపిస్తున్నాడు. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో రాణించినా.. మిగిలిన మూడు ఇన్నింగ్స్‌లో విఫలం అయ్యాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని వెంటాడుతూ వికెట్ల వెనకే క్యాచ్ ఔటవుతున్నాడు. ఆసీస్ గడ్డపై తిరుగులేని రికార్డు ఉన్న కోహ్లీ.. ఆ బలహీనతను అధిగమించి మునుపటి ఫామ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ క్రమంలో కోహ్లీకి మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఓ సలహా ఇచ్చాడు. 2003/04 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అడిలైడ్‌లో సచిన్ ఆడిన ఇన్నింగ్స్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించాడు. తన కెరీర్ ఆరంభంలో ఇలాగే ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని వెంటాడుతూ ఔట్ అయ్యాడని, ఆ తరువాత మళ్లీ ఇప్పుడు అదే బలహీనతో కోహ్లీ పెవిలియన్‌కు చేరుకుంటున్నాడని గవాస్కర్ తెలిపాడు.
IND vs AUS 3rd Test : గబ్బా టెస్టులో బుమ్రా ఆడతాడా? ఆడడా?
2003/04 ఆస్ట్రేలియాలో పర్యటనలో సచిన్ కూడా ఇలాగే ఔట్ అయ్యాడని గవాస్కర్ తెలిపాడు. ఆ సిరీస్‌లో ఈ బలహీతను అధిగమిస్తూ అడిలైడ్ లో 241 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
అడిలైడ్ కంటే ముందు జరిగిన మూడు టెస్టు మ్యాచుల్లో సచిన్ ఆఫ్ స్టంప్ మీద పడిన బంతులను ఆడి కవర్స్ లేదా సిప్స్‌లో ఔట్ అయ్యాడు. అయితే.. అడిలైడ్‌లో మాత్రం ఎంతో పట్టుదల ప్రదర్శించాడు. అతడు ఒక్క కవర్ డ్రైవ్ ఆడలేదు. మిడాన్, మిడాఫ్ దిశగా ఆడుతూ 241 పరుగులు స్కోరు చేశాడు. అలాగే.. కోహ్లీ సైతం ఔట్ సైట్ ఆఫ్ స్టంప్ బంతులను ఆడకూడదని నిర్ణయించుకోవాలన్నాడు. సచిన్ ఎలాగైతే డబుల్ సెంచరీ చేశాడో అలాగే కోహ్లీ సైతం గబ్బాలో డబుల్ సెంచరీతో చెలరేగాలని గవాస్కర్ ఆకాంక్షించాడు.
అయితే.. ఇది అంత ఈజీ కాదన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్‌తో పాటు ఆ జట్టు పేసర్లు కోహ్లీ బలహీనతను కనిపెట్టారని, గబ్బాలోనూ ఆ జట్టు ఆఫ్ స్టంప్ వ్యూహాన్నే అనుసరించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించాడు. ఈ క్రమంలో సచిన్ అడిలైడ్ ఇన్నింగ్స్ నుంచి కోహ్లీ స్ఫూర్తి పొందాలని గవాస్కర్ సూచించాడు. ప్ర్యతర్థి వ్యూహాలను చిత్తు చేయాలన్నాడు.