Suryakumar Yadav : అవార్డు అందుకునేందుకు గొడుగు పట్టుకుని వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. భార్య అందమైన కథ చెప్పిందంట..
ఢిల్లీ పై విజయంలో సాధించడంలో ముంబై ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

Suryakumar Yadav collects his POTM award with the umbrella on
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది. వాంఖడే వేదికగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ముంబై విజయంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 44 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపిక అయ్యాడు.
మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో వర్షం పడడంతో గొడుగుతో సూర్యకుమార్ యాదవ్ స్టేజీ పైకి వచ్చి అవార్డు అందుకున్నాడు. అంతే కాదండోయ్.. వ్యాఖ్యాత హర్షా భోగ్లేతో మాట్లాడే సమయంలో.. సదరు వ్యాఖ్యాతకి గొడులోకి రమ్మని ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్యది ఎంతో మంచి మనసు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Suryakumar Yadav collects his POTM award with the umbrella on. 😄☔ pic.twitter.com/emsSNSKYBs
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2025
ఇక అవార్డు అందుకున్న తరువాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ముంబై 13 మ్యాచ్‌లు ఆడింది. ఈ రోజు ఉదయం నా భార్య నాకు ఒక మధురమైన కథ చెప్పింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తప్ప మిగిలిన అన్ని అవార్డులు నీకు వచ్చాయని అంది. ఇప్పుడు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. జట్టు దృక్కోణం నుంచి చూస్తే నా ఇన్నింగ్స్ ఎంతో ముఖ్యమైనది. అలాగే ఈ అవార్డు నా భార్య కోసమే. ఆమె ఇలాంటి క్షణాల కోసం ఎదురు చూస్తుంది. ఇక మేము సెలబ్రేట్ చేసుకుంటాం.’ అని సూర్య తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. చమీర, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్‌లు తలా ఓ వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ విఫలమైంది. 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కొ వికెట్ సాధించారు.
RAIN + UMBRELLA + POST MATCH PRESENTATION..!!! 😂👌 pic.twitter.com/eukDvhIvL6
— Johns. (@CricCrazyJohns) May 21, 2025