Team india : వన్డే ప్రపంచకప్ విజయం.. భారీగా పెరిగిన మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ!
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజయంతో భారత (Team india ) మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది.
                            Team india Indian cricketers brand value increased immensely after winning world cup
Team india : దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. టీమ్ఇండియా (Team india) ఎట్టకేలకు మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. హర్మన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంతో భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాదాపు 25 శాతం నుంచి 100 శాతం పెరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
ఇక అదే సమయంలో స్టార్ ప్లేయర్లు.. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మల సోషల్ మీడియాల్లో ఫాల్లోవర్లు భారీగా పెరిగారు. కొంత మంది ఫాలోవర్లు ఏకంగా రెండు నుంచి మూడు రెట్లు పెరిగినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.
ఇక మహిళా క్రికెటర్ల బ్రాండ్ ఎండార్స్‌మెంట్ విచారణలు పెరిగాయి. కొత్త ఎండార్స్‌మెంట్లే కాకుండా.. పాత వాటి పెంపు విషయమై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా పై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్; 134 బంతుల్లో 14 ఫోర్లతో) బ్రాండ్ వాల్యూ 100 శాతం పెరిగిందట. ప్రస్తుతం ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు రూ.75 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
స్మృతి మంధాన టాప్..
దేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్ స్మృతి మంధాన. ఆమె ఇప్పటికే రెక్సోనా డియోడరెంట్, నైక్, హ్యుందాయ్, హెర్బాలైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గల్ఫ్ ఆయిల్, PNB మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ వంటి 16 బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నారు. ఒక్కో బ్రాండ్ ద్వారా ఆమె రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.
