Team India : ప్రపంచకప్ మధ్యలో బీసీసీఐ కీలక నిర్ణయం..! భారత ఆటగాళ్లకు మూడు రోజులు సెలవులు..?
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. కివీస్‌తో మ్యాచ్ తరువాత భారత జట్టు ఇంగ్లాండ్‌తో అక్టోబర్ 29న తలపడనుంది.

pic@bcci twitter
Team India Players : వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడగా అన్ని మ్యాచుల్లోనూ జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో ఆదివారం (అక్టోబర్ 22న) కీలకమైన న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడనుంది. ధర్మశాల ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. కివీస్‌తో మ్యాచ్ తరువాత భారత జట్టు ఇంగ్లాండ్‌తో అక్టోబర్ 29న తలపడనుంది. అంటే కివీస్‌తో మ్యాచ్ తరువాత టీమ్ఇండియాకు వారం రోజుల పాటు సమయం ఉంది.
మ్యాచులు ఆడేందుకు టీమ్ఇండియా ఆటగాళ్లు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు భారత ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తుందట. ఆటగాళ్లు ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వనుందట. ఆటగాళ్లు తిరిగి రాగానే ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించి తిరిగి క్రికెట్ మూడ్‌లోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారట. దీని వల్ల ఆటగాళ్లు ఉత్సాహంగా మైదానంలోకి దిగుతారని బీసీసీఐ భావిస్తోందని అంటున్నారు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో లీగ్ స్టేజ్‌లో తొమ్మిది మ్యాచులను టీమ్ఇండియా తొమ్మిది నగరాల్లో ఆడుతోంది. ఈ టోర్నీలో ఇలా ఆడుతున్న ఏకైక జట్టు టీమ్ఇండియానే కావడం గమనార్హం. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ఆటగాళ్లు లక్నోకు వెళ్లి ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు.