Suryakumar Yadav : బంతి రంగు ఒకేలా ఉంది.. జట్లు ఒకేలా ఉన్నాయి.. బౌల‌ర్లు వారే.. అయితే..

సూర్య కుమార్‌ యాదవ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి కాస్త ఆల‌స్యంగా ఎంట్రీ ఇచ్చినా త‌న‌దైన ఆట‌తీరుతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు.

Suryakumar Yadav : బంతి రంగు ఒకేలా ఉంది.. జట్లు ఒకేలా ఉన్నాయి.. బౌల‌ర్లు వారే.. అయితే..

Suryakumar Yadav

Suryakumar Yadav first ODI half century : సూర్య కుమార్‌ యాదవ్ ( Suryakumar Yadav) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి కాస్త ఆల‌స్యంగా ఎంట్రీ ఇచ్చినా త‌న‌దైన ఆట‌తీరుతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. మైదానం న‌లువైపులా షాట్లు కొడుతూ.. మిస్ట‌ర్ 360 డిగ్రీస్ ఆట‌గాడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ టీ20 ల్లో నంబ‌ర్ వ‌న్ ర్యాంకింగ్స్‌లో కొన‌సాగుతున్నాడు. పొట్టి ఫార్మ‌ట్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ కు తిరుగులేదు. అయితే.. వ‌న్డేల విష‌యానికి వ‌చ్చే స‌రికి తేలిపోతున్నాడు.

వ‌న్డేల్లో ఎన్ని అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. ఆఖ‌రకు వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్‌లో కూడా దారుణ ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించాడు. అయిన‌ప్ప‌టికీ అత‌డిని ఆసియాక‌ప్ 2023తో పాటు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023కి ఎంపిక చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆసియా క‌ప్‌కు ఎంపికైన‌ప్ప‌టికీ బెంచ్‌కే ప‌రిమితం అయ్యాడు. కాగా.. స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో రాణించ‌క‌పోతే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత‌డి స్థానం గ‌ల్లంతు కావ‌డం ఖాయం అని ప‌లువురు విశ్లేషించారు.

ఎట్ట‌కేల‌కు ..

ఎట్ట‌కేల‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న మొద‌టి వ‌న్డే అర్థ‌శ‌త‌కాన్ని సాధించాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో 49 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించి త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లకు త‌న ఆట‌తీరుతోనే స‌మాధానం చెప్పాడు. వన్డేల్లో 590 రోజుల తర్వాత సూర్య అర్థ‌శ‌త‌కాన్ని సాధించ‌డం గ‌మ‌నార్హం.

KL Rahu : రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంపై కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

‘ఈ ఫార్మాట్‌లో ఆడ‌డం ప్రారంభించిన‌ప్పుడు ఒకే ఒక క‌ల క‌న్నాను. సాధ్య‌మైనంత వ‌ర‌కు మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు బ్యాటింగ్ చేసి జ‌ట్టును గెలిపించాల‌ని కోరుకున్నాను. ఈ రోజు అలా చేయ‌లేక‌పోయాను. అయిన‌ప్ప‌టికీ ఈ కొత్త పాత్ర‌ను ఎంతో ఇష్ట‌ప‌డుతున్నాను. అయితే.. కొన్ని సార్లు ఇలా అనిపిస్తుంటుంది. బంతి రంగు ఒకేలా ఉంది. జ‌ట్లు ఒకేలా ఉన్నారు. బౌల‌ర్లు ఒకేలా ఉన్నారు. నేను కాస్త తొంద‌ర‌ప‌డుతున్నానా..? కాస్త క్రీజులో నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని భావించాను. సాధ్య‌మైనంత వ‌ర‌కు చివ‌రి వ‌ర‌కు బ్యాటింగ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను.’ అని సూర్య‌కుమార్ యాద‌వ్ చెప్పాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 276 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ల‌క్ష్యఛేద‌న‌లో ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్‌(74), రుతురాజ్ గైక్వాడ్ (71) లు మొద‌టి వికెట్‌కు 142 ప‌రుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే.. వీరిద్ద‌రితో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్ (3), ఇషాన్ కిష‌న్ (18)లు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. దీంతో 185 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది.

అయితే.. కెప్టెన్ కేఎల్ రాహుల్‌(58 నాటౌట్)తో క‌లిసి సూర్య‌కుమార్ యాద‌వ్ (50) కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. విజ‌యానికి మ‌రో 12 ప‌రుగులు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో సూర్య ఔటైనా జ‌డేజాతో క‌లిసి రాహుల్ మిగిలిన ప‌నిని పూర్తి చేశాడు.

India Cricket Team : చరిత్ర సృష్టించిన భారత్.. అన్ని ఫార్మాట్స్‌లో నెంబర్ 1