Travis Head : అదేం కొట్టుడు సామీ.. టెస్టు అనుకుంటివా.. టీ20 అనుకుంటివా? 127 ఏళ్ల రికార్డు బ్రేక్..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు
AUS vs ENG 1st test Travis Head scores century in 69 balls second fastest in Ashes
Travis Head : యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. రెగ్యులర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వెన్నునొప్పితో బాధపడుతుండడంతో రెండో ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 205 లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
బంతి పడితే బౌండరీకి తరలించడమే లక్ష్యంగా అతడి బ్యాటింగ్ సాగుతోంది. కేవలం 69 బంతుల్లో అతడు సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో యాషెస్ సిరీస్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ జాబితాలో ఆడమ్ గిల్ క్రిస్ట్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2006లో పెర్త్ వేదికగానే జరిగిన టెస్టు మ్యాచ్‌లో 57 బంతుల్లో గిల్‌క్రిస్ట్ శతకం బాదాడు.
యాషెస్ సిరీస్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
* ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 57 బంతుల్లో
* ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) – 69 బంతుల్లో
* గిల్బర్ట్ జెస్సోప్ (ఇంగ్లాండ్) – 76 బంతుల్లో
* జో డార్లింగ్ (ఆస్ట్రేలియా) – 85 బంతుల్లో
* ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) – 85 బంతుల్లో
ONE OF THE GREATEST ASHES HUNDREDS. 🥶
– Travis Head with a 69 ball century in the 4th innings. 🤯
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2025
అంతేకాదండోయ్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు జో డార్లింగ్‌ను అధిగమించాడు. 1898లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో 275 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాగీ గ్రీన్స్ తరపున ఆస్ట్రేలియాకు చెందిన జో డార్లింగ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి 85 బంతుల్లో సెంచరీ చేశాడు.
