తాయెత్తులు కట్టించుకున్న లంక ప్లేయర్లు, జనవరిలో భారత పర్యటన

జింబాబ్వే క్రికెట్ జట్టును ఐసీసీ నిషేదించింది. దీంతో భారత్‌లో దేశంలో పర్యటించాల్సి ఉన్న జింబాబ్వే స్థానంలో శ్రీలంక ఎంటర్ అయింది. ఈ మేర 2020 జనవరిలో శ్రీలంక జట్టు మూడు టీ20ల సిరిస్ కోసం భారత్‌లో పర్యటించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ మూడు టీ20లు జనవరి 5, 7, 10న నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం శ్రీలంక జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో లంక జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది. జనవరి 2009 తర్వాత కరాచీ వేదికగా తొలి వన్డేను సెప్టెంబర్ 27న ఆడేందుకు సిద్ధమైంది. పాక్ గడ్డపై పదేళ్ల తర్వాత ద్వైపాక్షిక సిరిస్ జరుగుతున్న సందర్భంగా పాక్ క్రికెట్ అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
పూర్తి జట్టు వెళ్తున్నప్పటికీ భద్రతాపరమైన అనుమానాలతో కెప్టెన్‌లు దూరంగా ఉన్నారు. లసిత్ మలింగ, దిముత్ కరుణరత్నె సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు పర్యటనకు వెళ్లడం లేదు. శ్రీలంక జట్టులోని ఆటగాళ్లంతా బౌద్ధ గురువుతో తాయెత్తులు కట్టించుకున్నారు. ఈ ఫొటోలను లంక బోర్డు ట్విటర్‌లో పోస్టు చేసింది. 2009లో పాక్ పర్యటన చేసిన శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.