UAE vs BAN : చరిత్ర సృష్టించిన యూఏఈ.. బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం..
పసికూన యూఏఈ టీమ్ చరిత్ర సృష్టించింది.

United Arab Emirates win the T20 series against Bangladesh
పసికూన యూఏఈ టీమ్ చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్ పై తొలిసారి టీ20 సిరీస్‌ను గెలిచింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-1 తేడాతో మట్టికరిపించింది. బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో బంగ్లాపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో తంజిద్ హసన్ (18 బంతుల్లో 40 పరుగులు), జాకర్ అలీ (34 బంతుల్లో 41 పరుగులు) లు రాణించారు. కెప్టెన్ లిటన్ దాస్ (14),తౌహీద్ హృదోయ్(0), మెహదీ హసన్ మిరాజ్ (2) లు విఫలం అయ్యారు.
యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ మూడు వికెట్లు తీశాడు. సఘీర్ ఖాన్, మతియుల్లా ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆకిఫ్ రాజా, ధ్రువ్ పరాషర్ తలా ఓ వికెట్ సాధించారు.
🚨 A HISTORIC MOMENT IN CRICKET 🚨
– UAE WON THE T20I SERIES AGAINST BANGLADESH AT SHARJAH…!!! 🏆 pic.twitter.com/iXQqavyrEc
— Johns. (@CricCrazyJohns) May 22, 2025
అనంతరం లక్ష్యాన్ని యూఏఈ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. యూఏఈ బ్యాటర్లలో అలిషాన్ షరాఫూ (68 నాటౌట్; 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. అతడితో పాటు ఆసిఫ్ ఖాన్ (41నాటౌట్; 26 బంతుల్లో 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, తంజిమ్ హసన్ సకీబ్, రిషద్ హొస్సేన్ తలా ఓ వికెట్ తీశారు.
దీంతో టీ20 సిరీస్‌ను యూఏఈ 2-1తో కైవసం చేసుకుంది. టెస్టు హోదా కలిగిన జట్టు ద్వైపాక్షిక సిరీస్ గెలడం యూఏఈకి ఇదే తొలిసారి.