సిక్సులు, ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోసిన వైభవ్ సూర్యవంశీ.. 12 ఏళ్ల రికార్డు బద్దలు.. వీడియో వైరల్

భారత అండర్-19 వర్సెస్ ఇంగ్లాండ్ అండర్ -19 జట్ల మధ్య జరిగిన నాల్గో వన్డే మ్యాచ్‌‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేశాడు.

సిక్సులు, ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోసిన  వైభవ్ సూర్యవంశీ.. 12 ఏళ్ల రికార్డు బద్దలు.. వీడియో వైరల్

Vaibhav Suryavanshi

Updated On : July 6, 2025 / 10:51 AM IST

Vaibhav Suryavanshi:  వైభవ్ సూర్యవంశీ.. ఈ 14ఏళ్ల బుడ్డోడు క్రీజులో ఉన్నాడంటే ఇంగ్లాండ్ బౌలర్లు వణికిపోతున్నారు. బాల్ ఎక్కడ వేయాలో తెలియక హడలిపోతున్నారు. పడిన బాల్ పడినట్లుగా బౌండరీలకు పంపిస్తూ తనదైన దూకుడు బ్యాటింగ్ ను ఇంగ్లాండ్ బౌలర్లకు వైభవ్ సూర్యవంశీ రుచిచూపిస్తున్నాడు. తాజాగా.. వోర్సెస్టర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ లో వైభవ్ చెలరేగి పోయాడు. మైదానంలో చిన్నపాటి పరుగుల సునామీ సృష్టించాడు.

Also Read: India Bangladesh Series: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు నిరాశ..! మరికొన్నాళ్లు ఆగాల్సిందే.. భారత్-బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా..

ఇంగ్లాండ్ వేదికగా భారత అండర్-19 వర్సెస్ ఇంగ్లాండ్ అండర్ -19 జట్ల మధ్య ఐదు వన్డే మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా.. నాల్గో మ్యాచ్ శనివారం వోర్సెస్టర్ వేదికగా జరిగింది. మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ అండర్ -19 జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే విఫలంకాగా.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలాగే తన దూకుడైన బ్యాటింగ్‌లో మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు.

 

వైభవ్ సూర్యవంశీ కేవలం 52 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ యువ బ్యాటర్ మొత్తం 78 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 143 పరుగులు చేశాడు. దీంతో అతను సరికొత్త చరిత్రను లిఖించాడు. యూత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ బ్యాటర్ కమ్రాన్ గులామ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును అధిగమించాడు. 2013లో ఇంగ్లాండ్ అండర్ -19 జట్టుతో జరిగిన మ్యాచ్ లో కమ్రాన్ గులామ్ 53 బంతుల్లో శతకం సాధించాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి 12ఏళ్ల రికార్డును అధిగమించాడు.


ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీతో పాటు విహాన్ మల్హోత్రా (129) సెంచరీ చేశాడు. దీంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 363 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 308 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు బెన్ డాకిన్స్ (67), జోసెఫ్ మూర్స్ (52) అర్ధ సెంచరీలు చేయగా.. రాకీ ఫ్లింటాఫ్ (107) సెంచరీ కొట్టాడు. అయితే, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోవటంతో భారత్ అండర్-19 జట్టు విజేతగా నిలిచింది.

ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్ -19 జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంది. మొదటి, మూడు, నాల్గో యూత్ వన్డేల్లో భారత్ జట్టు విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ అండర్-19 జట్టు కైవసం చేసుకుంది.