వినేశ్ ఫొగాట్ పై సాక్షిమాలిక్ సంచలన ఆరోపణలు.. ఘాటుగా స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
సాక్షి మాలిక్ వ్యాఖ్యలపై క్రీడల నుంచి రిటైర్ అయ్యి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన వినేశ్ పొగట్ స్పందించారు. తాను సాక్షి మాలిక్ అభిప్రాయంతో ఏకీభవించనని పేర్కొన్నారు.

Vinesh Phogat and Sakshi Malik
Sakshi Malik: మహిళా రెజ్లర్లపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై మహిళా రెజ్లర్లు పెద్దెత్తున ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. సాక్షి మాలిక్, వినేశ్, బజరంగ్ లు ఈ నిరసనకు నాయకత్వం వహించారు. ఈ కేసు ఇంకా ఢిల్లీ కోర్టులో విచారణలో ఉంది. సాక్షి మాలిక్ ఇటీవల ఆత్మకథతో పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో తన సహచరులు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాలపై సంచలన విమర్శలు చేశారు. బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసన బలహీన పడటానికి వినేశ్, బజరంగ్ పునియాలు కారణమని ఆరోపించారు. 2023 ఆసియా క్రీడల ట్రయల్స్ నుంచి మినహాయింపును కోరాలని వినేశ్, బజరంగ్ తీసుకున్న నిర్ణయం తమ నిరసన ప్రతిష్టను దెబ్బతీసిందని సాక్షి మాలిక్ ఆరోపించింది. ఈ నిర్ణయం తరువాత తమ పోరాటం స్వార్థపూరితమైనదిగా కనిపించిందని, బయటి ప్రభావాల కారణంగా నిరసన బలహీన పడిందని సాక్షి మాలిక్ పుస్తకంలో రాసింది.
Also Read: డ్రోన్.. ది గేమ్ ఛేంజర్..! యుద్ధమైనా, సాయమైనా, వ్యవసాయమైనా డ్రోన్లదే కీరోల్..!
సాక్షి మాలిక్ వ్యాఖ్యలపై క్రీడల నుంచి రిటైర్ అయ్యి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వినేశ్ పొగట్ స్పందించారు. తాను సాక్షి మాలిక్ అభిప్రాయంతో ఏకీభవించనని పేర్కొన్నారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. దానితో నేను ఏకీభవించను. దేనికోసం దురాశ? మీరు ఆమెను (సాక్షి మాలిక్) అడగాలి. నేను బలహీనంగా ఉంటే తప్ప, పోరాటం బలహీనం కాదు. అది నా నమ్మకం. సాక్షి, వినేశ్, బజరంగ్ లు జీవించి ఉన్నంత వరకు పోరాటం బలహీనంగా ఉండదు. గెలవాలని కోరుకునే వారు ఎప్పటికీ బలహీనులు కాకూడదు. వారు ఎప్పుడూ మైదానంలో పోరాడాలని ఎంచుకోవాలి. ఈ క్రమంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు మేం సిద్ధంగా ఉన్నామని వినేశ్ పోగట్ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే బజరంగ్, వినేశ్ పొగట్ గత పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వినేశ్ పొగట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే, హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది.