కోహ్లీని కెప్టెన్ గా తొలగించండి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీని కెప్టెన్ గా తొలగించాలని ట్విట్టర్ వేదికగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 12వ సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ విజయం దక్కించుకోని బెంగళూరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆర్సీబీ కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటి వరకూ ఆడిన 100మ్యాచ్ లలో మొత్తానికి 45 మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఇన్ని సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ ఒక్క టైటిల్ కూడా గెలుచుకోకపోవడం గమనార్హం. ప్రతి సీజన్ ను తాజాగా మొదలుపెట్టేందుకే ప్రయత్నించినా పరాజయాలతోనే ఇన్నింగ్స్ ముగిస్తుంది. మంగళవారం రాజస్థాన్ తో జరిగిన పోరులోనూ ఓటమి బాటనే పట్టింది.
మ్యాచ్ గెలవాలంటే ఆర్బీబీ జట్టులో ఉన్న స్టార్ బ్యాట్స్ మెన్ డివిలియర్స్.. విరాట్ కోహ్లీలు ఊపందుకోవాల్సిందే. కానీ, 2019సీజన్ లో బెంగళూరు జట్టులో ఫామ్ అందుకోకపోవడం పెను సమస్యగా మారింది. ఈ క్రమంలో కోహ్లీ కెప్టెన్సీయే జట్టుకు ఇబ్బందిగా మారిందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కోహ్లీ సరైన సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని కెప్టెన్ మార్చమని సలహాలిస్తున్నారు.