IND vs AUS : సెమీస్ లో సెంచ‌రీ మిస్ కావ‌డంపై విరాట్ కోహ్లీ కీల‌క వ్యాఖ్య‌లు.. శ‌త‌కం సాధిస్తే ఆనంద‌ప‌డేవాడిని కానీ..

ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంత‌రం కోహ్లీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.

IND vs AUS : సెమీస్ లో సెంచ‌రీ మిస్ కావ‌డంపై విరాట్ కోహ్లీ కీల‌క వ్యాఖ్య‌లు.. శ‌త‌కం సాధిస్తే ఆనంద‌ప‌డేవాడిని కానీ..

Virat Kohli comments after win the semi final match against australia

Updated On : March 5, 2025 / 10:17 AM IST

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భార‌త్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 265 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 48.1 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త విజ‌యంలో స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ కీల‌క పాత్ర పోషించాడు. 98 బంతులు ఎదుర్కొన్న అత‌డు 5 ఫోర్లు సాయంతో 84 ప‌రుగులు చేశాడు. దీంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

కోహ్లీ సెంచ‌రీ చేసేలా క‌నిపించినా ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి డ్వార్షుయిస్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక మ్యాచ్ అనంత‌రం సెంచ‌రీ మిస్ కావ‌డంపై కోహ్లీ స్పందించాడు. త‌న‌కు సెంచ‌రీ చేయ‌డం కంటే జ‌ట్టు గెల‌వ‌డం ఎంతో ముఖ్యం అని చెప్పాడు. మైలురాళ్ల గురించి తాను ఎక్కువ‌గా ప‌ట్టించుకోన‌ని చెప్పాడు.

IND vs AUS : గిల్ ‘క్లీన్ క్యాచ్’ వివాదం.. నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి.. క్యాచ్‌ను ప‌ట్టుకున్న ఆట‌గాడు ఎంత‌సేపు బంతిని చేతిలో ఉంచుకోవాలి?

‘నేను ఎప్పుడు రికార్డుల గురించి ప‌ట్టించుకోను. వాటిపై అస‌లు ఫోక‌స్ చేయ‌ను. జ‌ట్టు విజ‌యానికే ప్రాధాన్యం ఇస్తాను. పాక్‌తో మ్యాచ్ ఆడిన‌ట్లే తాజాగా ఆసీస్ పైనా ఆడాను. ముఖ్యంగా ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని స్ట్రైక్ రొటేట్ చేయ‌డంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాను.’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

ఇలాంటి త‌ర‌హా పిచ్‌ల‌పై భాగ‌స్వామ్యాలు నెల‌కొల్ప‌డం ఎంతో కీల‌కం అని తెలిపాడు. సాధించాల్సిన ర‌న్‌రేట్ 6 దాటినా తాను భ‌య‌ప‌డేవాడిని కాద‌న్నాడు. ప్ర‌శాంతంగా ఉంటే మ్యాచ్‌లో గెల‌వ‌డం చాలా సుల‌భం అని చెప్పాడు. ఇది త‌న అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న అని చెప్ప‌లేన‌ని అన్నాడు. సెంచ‌రీ చేస్తే ఆనందం ఉండేద‌ని, అయితే.. జ‌ట్టు విజ‌యం కంటే త‌న‌కు సెంచ‌రీ ముఖ్యం కాద‌న్నాడు. మొత్తంగా త‌న‌కు సెంచ‌రీ మిస్ అయింద‌న్న బాధ ఏ మాత్రం లేద‌న్నాడు.

IND vs AUS : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ఐసీసీ వన్డే టోర్నీల్లో ఒకే ఒక్క‌డు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ(61)లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయ‌గా, వరుణ్ చక్రవర్తీ, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అనంత‌రం కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్(42 నాటౌట్‌), హార్దిక్ పాండ్యా(28)రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని భార‌త్ 48.1 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది.

ఇక ఫైన‌ల్ మ్యాచ్ మార్చి 9 (ఆదివారం) జ‌ర‌గ‌నుంది. బుధ‌వారం ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న రెండో సెమీస్ మ్యాచ్‌లో విజేత‌గా నిలిచిన జ‌ట్టుతో ఆదివారం ఫైన‌ల్‌లో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.