Virat Kohli-Ravi Shastri : కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించడానికి వారం ముందే అతడితో మాట్లాడా.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు..
విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించడానికి వారం ముందే అతడితో ఈ విషయం గురించి మాట్లాడినట్లు మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పాడు.

Virat Kohli Intense Chat With Ravi Shastri Before Test Retirement
జూన్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమ్ఇండియా.. ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. కాగా.. ఈ పర్యటనకు సరిగ్గా నెలన్నరకు ముందు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. కోహ్లీ రిటైర్‌మెంట్ తనను ఆశ్చర్యపరిచిందని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో మరో రెండు నుంచి మూడేళ్లు ఆడే సత్తా అతడిలో ఉందన్నాడు.
విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించడానికి వారం రోజుల ముందు అతడితో మాట్లాడినట్లు రవిశాస్త్రి చెప్పాడు. కోహ్లీ మానసికంగా అలసిపోయాడని చెప్పుకొచ్చాడు. ‘కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించడానికి వారం రోజుల ముందు దీని గురించి అతడితో మాట్లాడాను. అప్పుడు అతడు ఆటకు ఇవ్వగలిగినంత ఇచ్చానన్న స్పష్టతతో ఉన్నాడు. రిటైర్‌మెంట్ గురించి ఎలాంటి విచారం లేదు.’ అని రవిశాస్త్రి తెలిపాడు.
ఇక అతడు తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యపరిచినట్లుగా రవిశాస్త్రి చెప్పాడు. ‘ఎందుకంటే అతడిలో మరో రెండు నుంచి మూడేళ్ల పాటు టెస్టు క్రికెట్ ఆడే సత్తా ఉన్నట్లు నాకు అనిపించింది. అతడు శారీరకంగా చాలా ఫిట్‌గానే ఉన్నాడు. అయితే.. మానసికంగా బాగా అలసిపోయాడు. కోహ్లీ మైదానంలో అడుగుపెట్టినప్పుడు అన్ని వికెట్లు తానే తీయాలి, అన్ని క్యాచ్‌లు తానే పట్టాలి. అన్ని నిర్ణయాలు తానే తీసుకోవాలి అనే తీవ్రత అతడిలో కనిపిస్తుంటుంది.’ అని రవిశాస్త్రి అన్నాడు.
ఈ స్థాయిలో తీవ్రత ఉంటే.. అతడు విశ్రాంతి తీసుకోవాలి. లేకపోతే మానసికంగా అలసిపోకతప్పదు అని రవిశాస్త్రి అన్నాడు. ఇక అతడు ప్రత్యేకంగా సాధించడానికి ఏమీ లేదన్నాడు.
IPL 2025 : రేపటి నుంచే ఐపీఎల్ 2025 రీస్టార్ట్.. 7జట్లు.. 4 బెర్తులు.. ప్లేఆఫ్స్ సమీకరణం ఇలా..
కోహ్లీ 123 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. 68 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించగా.. 40 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందింది.