Virat Kohli : మూడు రోజుల్లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. స్వదేశానికి వచ్చేసిన కోహ్లీ..! భారత్‌కు వరుస షాక్‌లు..
మూడు రోజుల్లో టెస్టు సిరీస్ ఆరంభం కానుండగా ఈ సిరీస్ కోసం ఇటీవలే సౌతాఫ్రికా వెళ్లిన టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అర్ధాంతరంగా దక్షిణాఫ్రికా నుంచి భారత్ చేరుకున్నాడు.

Virat Kohli
Virat Kohli – Team India : దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్ వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా రెట్టించిన ఉత్సాహంతో టెస్టు సిరీస్‌కు సిద్దమవుతోంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు మొదటి టెస్టు మ్యాచ్, జనవరి మూడు నుంచి 7 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
కాగా.. మరో మూడు రోజుల్లో టెస్టు సిరీస్ ఆరంభం కానుండగా ఈ సిరీస్ కోసం ఇటీవలే సౌతాఫ్రికా వెళ్లిన టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అర్ధాంతరంగా దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు చేరుకున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం తెలిసి అభిమానులు కంగారు పడుతున్నారు. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం టీ20 ఫార్మాట్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉంటూ వస్తున్నాడు. అదే సమయంలో వన్డే ప్రపంచకప్ అనంతరం వన్డేలు సైతం ఆడలేదు.
ఇప్పుడు టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లిన కోహ్లీ.. సిరీస్ మొదలు కాకుండానే తిరిగి రావడంతో ఏం జరిగిందనే ప్రశ్న అందరిలో మొదలైంది. అయితే.. ఫ్యామిలి ఎమర్జెన్సీ కారణంగా కోహ్లీ స్వదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 19నే కోహ్లీ భారత్‌కు బయలుదేరాడని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ వెల్లడించింది. మొదటి టెస్టు మ్యాచ్ సమయానికి కోహ్లీ జట్టుతో చేరతాడా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
Sanju Samson: సంజూ శామ్సన్ ఫస్ట్ వన్డే సెంచరీ.. చాలా కాలం గుర్తుంటుంది..
స్వదేశానికి రావడంతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోహ్లీ ఆడలేదు. మొదటి టెస్టు సమయానికి అతడు జట్టుతో చేరినా కూడా ప్రాక్టీస్ లేకుండా నేరుగా అతడిని మ్యాచ్ ఆడిస్తారా..? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
రుతురాజ్ సైతం..
ఇదిలా ఉంటే.. వన్డే సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా అతడి చేతి వేలికి గాయమైంది. ఈ క్రమంలో అతడు ఆఖరి వన్డే ఆడలేదు. గాయం తీవ్రత దృష్ట్యా అతడు టెస్టు సిరీస్ నుంచి వైదొలిగినట్లు సమాచారం. కాగా.. డబ్ల్యూటీసీ 2023-2025 సైకిల్‌లో ఫైనల్ కు చేరుకునేందుకు దక్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను గెలవడం భారత్‌కు ఎంతో కీలకం. ఇలాంటి తరుణంలో ఇప్పటికే ఫామ్‌లో ఉన్న షమీ దూరం కాగా.. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్‌లో ఆడకుంటే అది భారత విజయావకాశాలపై ప్రభావం చూపనుంది.
WI vs ENG 2nd T20 : సిక్స్ ఇలా కొట్టాలని ఇన్ని రోజులు తెలియదు భయ్యా..! వీడియో వైరల్
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా గడ్డపై భారత జట్టు ఇంత వరకు ఒక్క సారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు అన్న సంగతి తెలిసిందే. హిట్‌మ్యాన్ రోహిత్ సారథ్యంలో అందని ద్రాక్షగా ఊరిస్తున్న సఫారి గడ్డ పై టెస్టు సిరీస్‌ను భారత్ అందుకోవాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు.