IPL 2026 : ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఎప్పుడు? బీసీసీఐ ఎందుకు ఆలస్యం చేస్తోంది?
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది.
When will bcci announce IPL 2026 schedule Why delay
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది. ఈ సీజన్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను ఇప్పటి వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విడుదల చేయలేదు.
సాధారణంగా ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి దాదాపు నెలన్నర ముందే బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసేది. ఐపీఎల్ 2026 సీజన్‌కు నెల రోజులే సమయం ఉండడం, ఇప్పటి వరకు బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేయకపోవడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. లాజిస్టికల్, పరిపాలనా అడ్డంకులు, ఎన్నికలు వంటి కారణాల వల్ల షెడ్యూల్ ప్రకటించడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..
ఈ ఏడాది వేసవి కాలంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరితో సహా అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో జరుగుతాయని భావిస్తున్నారు.
ఎన్నికల సమయంలో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు పోలింగ్ విధుల్లో ఎక్కువగా పాల్గొంటాయి. దీని వలన ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించడం కాస్త కష్టం. ఆ సమయంలో జట్ల ప్రయాణానికి అంతరాయం కలగవచ్చు. ప్రసారకులు, అభిమానులకు లాజిస్టిక్స్ క్లిష్టంగా మారవచ్చు. అందుకే ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసే ముందు బీసీసీఐ.. ఎన్నికల కమిషన్ నుండి అధికారిక పోలింగ్ తేదీల కోసం వేచి ఉంది.
టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం..
టీ20 ప్రపంచకప్ 2026కి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా వంటి మైదానాల్లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌ల అనంతరం ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఈ స్టేడియాలను సిద్ధం చేయాల్సి ఉంది. పిచ్‌ల పునరుద్దరణ, రంగులు మార్చడం వంటి పనులు జరగాల్సి ఉంది. మార్చి 8న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆ తరువాత స్టేడియాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారు?
నివేదికల ప్రకారం.. ఎన్నికల తేదీలపై స్పష్టత పొందడానికి బీసీసీఐ ఎన్నికల కమిషన్‌తో సహా సంబంధిత అధికారులతో సంభాషిస్తోంది. ఎన్నికల తేదీపై స్పష్టత వచ్చిన తరువాతనే షెడ్యూల్ పై ముందుకు సాగాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటే.. దశలవారిగా ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసే అవకాశం ఉంది. ముందుగా ప్రారంభ షెడ్యూల్‌లను ప్రకటించవచ్చు.. మిగిలిన వాటిని ఎన్నికలు, వేదిక సమస్యలు పరిష్కరించబడిన తర్వాత ప్రకటించవచ్చు.
