IND vs PAK: గెలిచి తీరాల్సిందే.. పాక్‌తో హోరాహోరీ పోరుకు సిద్ధమైన భారత్.. మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది.. ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలంటే..?
ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఇరు జట్లు ..

IND vs PAK
ICC Womens T20 World Cup 2024: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అది మెన్స్ మ్యాచ్ అయినా… ఉమెన్స్ మ్యాచ్ అయినా. ఇవాళ రెండు దేశాల జట్లు బిగ్ పోరుకు సిద్ధమవుతున్నాయి. అదికూడా టీ20 ప్రపంచ కప్ టోర్నీలో. అయితే, భారత్ జట్టుకు ఈ మ్యాచ్ చావోరేవో పరిస్థితి. పాక్ పై ఓడిపోతే సెమీస్ ఆశలు గల్లంతయినట్లే. దీంతో పాక్ పై విజయం సాధించాలనే పట్టుదలతో భారత్ జట్టు బరిలోకి దిగుతోంది.
గెలిస్తేనే టోర్నీలో నిలిచేది..
ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ ఆడాయి. పాకిస్థాన్ జట్టు శ్రీలంకపై 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాక్ ప్లేయర్స్ ఉత్సాహంతో ఉన్నారు. భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుపై 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇవాళ పాక్ పై జరిగే మ్యాచ్ లో తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి. కివీస్ పై మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు తేలిపోయారు. వెంటవెంటనే వికెట్లు పోగొట్టుకున్నారు. బ్యాటర్లు రాణించని పక్షంలో ఓటమి తప్పదు. దీంతో ఇవాళ పాక్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కొంటారోననే ఆందోళన ఫ్యాన్స్ లో వ్యక్తమవుతుంది. ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్ ను ప్రారంభించడంతోపాటు.. స్మృతి మంధాన, షెఫాలి వర్మ, హర్మన్ ప్రీత్ పెద్ద ఇన్నింగ్స్ లు ఆడితేనే భారత్ జట్టుకు పెద్ద స్కోరు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కివీస్ పై బౌలింగ్ లోనూ భారత్ బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణిచలేదు. ఇవాళ పాక్ పై జరిగే మ్యాచ్ లో బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ వేగంగా వికెట్లు తీయాల్సి ఉంది.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి..
మహిళ టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా భారత్ లో వీక్షించొచ్చు. అదేవిధంగా హాట్‌స్టార్ యాప్ ద్వారా కూడా మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
A must win game for India tomorrow Vs Pakistan to stay in the contentions for Semi Final berth. pic.twitter.com/bjsrexcjjH
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2024