Womens T20 World Cup 2024 : ఇదేమీ సిత్రమో.. పాకిస్థాన్ గెలవాలని కోరుకుంటున్న భారత అభిమానులు!
మహిళల టీ20 ప్రపంచకప్‌లో విభిన్నమైన పరిస్థితి నెలకొంది.

Womens T20 World Cup 2024 India Fans will cheer for pakistan
Womens T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్‌లో విభిన్నమైన పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ ఎక్కడైనా ఆడుతుంటే ఆ జట్టు ఓడిపోవాలని కోరుకుంటాము. అయితే.. నేడు పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మాత్రం పాకిస్థాన్ గెలవాలని ఆ దేశ అభిమానుల కంటే భారత అభిమానులు ఎక్కువగా కోరుకుంటున్నారు. ఎందుకంటే కివీస్ పై పాకిస్థాన్ విజయం సాధిస్తే భారత్ సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ పాక్ ఓడిపోతే మాత్రం భారత్ గ్రూపు స్టేజీ నుంచే ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. అప్పుడు కివీస్ సెమీఫైనల్‌కు వెలుతుంది.
గ్రూపు ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. నాలుగు మ్యాచులు ఆడిన ఆసీస్ నాలుగు విజయాలతో 8 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంది. 4 మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ గెలవని శ్రీలంక రేసు నుంచి ఎప్పుడో తప్పుకుంది. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు రేసులో ఉన్నాయి. ఇందులో భారత్ 4 మ్యాచులు ఆడేసింది. 2 మ్యాచుల్లో గెలవగా మరో రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పాయింట్లు ఉండగా.. రన్‌రేట్ +0.3222గా ఉంది.
ఇక కివీస్ మూడు మ్యాచుల్లో 2 విజయాలు సాధించింది. 4 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నప్పటికి నెట్‌రన్‌రేట్ (+0.282) భారత్ కంటే తక్కువగా ఉంది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఒకవేళ పాకిస్థాన్ మ్యాచులో కివీస్ ఓడిపోతే.. మెరుగైన రన్‌రేట్ ఉన్న భారత్ సెమీస్ చేరుకుంటుంది.
అయితే.. ఇక్కడ మరో విషయం ఉంది.. పాకిస్థాన్ మరీ భారీ తేడాతో గెలవకూడదు. ఎందుకంటే పాక్ కూడా 3 మ్యాచులు ఆడింది. ఒక్క మ్యాచులో గెలిచింది. ఆ జట్టు ఖాతాలో 2 పాయింట్లు (నెట్‌రన్‌రేట్ -0.488) ఉన్నాయి. కివీస్ పై విజయం సాధిస్తే అప్పుడు పాకిస్థాన్ కూడా నాలుగు పాయింట్లతో ఉంటుంది. భారీ తేడాతో గెలిస్తే భారత్ రన్‌రేట్‌ను అధిగమించి సెమీస్ చేరుకునే అవకాశం ఉంది.
పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే?
– న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 150 పరుగులు చేస్తే.. ఆ లక్ష్యాన్ని పాకిస్థాన్ 9.1 ఓవర్లలోనే ఛేదించాలి. అప్పుడు మాత్రమే పాక్ సెమీస్‌కు చేరుకుంటుంది.
– ఒకవేళ పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 150 పరుగుల లక్ష్యాన్ని కివీస్ నిర్దేశించింది అనుకుందాం. లక్ష్య ఛేదనలో కివీస్ విఫలం అయితే.. ఇంటికి పోతుంది. అదే సమయంలో పాక్ 53 పరుగుల తేడాతో గెలవకూడదు. అంతకంటే తక్కువ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. లేదంటే భారత్ ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది.