ODI World Cup 2023 : ర‌స‌వ‌త్త‌రంగా సెమీస్ రేసు.. రెండు స్థానాల కోసం నాలుగు జ‌ట్ల పోటీ.. ఏ జ‌ట్లు సెమీస్ చేరుతాయంటే..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియాకు ఎదురులేకుండా పోయింది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లోనూ విజ‌యం సాధించి సెమీ ఫైన‌ల్ బెర్తును ఇప్ప‌టికే సొంతం చేసుకుంది.

ODI World Cup 2023 : ర‌స‌వ‌త్త‌రంగా సెమీస్ రేసు.. రెండు స్థానాల కోసం నాలుగు జ‌ట్ల పోటీ..  ఏ జ‌ట్లు సెమీస్ చేరుతాయంటే..?

World cup 2023 semi final scenario

ODI World Cup 2023 semi final scenario : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియాకు ఎదురులేకుండా పోయింది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లోనూ విజ‌యం సాధించి సెమీ ఫైన‌ల్ బెర్తును ఇప్ప‌టికే సొంతం చేసుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం 16 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాగా.. ఈ మ్యాచ్ ఫ‌లితంతో సంబంధం లేకుండానే భార‌త్ మొద‌టి స్థానంతోనే సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్ట‌నుంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు అంద‌రి దృష్టి సెమీస్‌లో భార‌త ప్ర‌త్య‌ర్థి ఎవ‌రు అన్న విష‌యంపైనే ఉంది. మ‌రో సెమీస్ బెర్తు ద‌క్షిణాఫ్రికా సొంతం చేసుకోగా మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి.

ఆస్ట్రేలియా.. (10 పాయింట్లు)

టోర్నీ ఆరంభంలో వ‌రుస‌గా రెండు మ్యాచులు ఓడిన ఆస్ట్రేలియా త‌రువాత పుంజుకుంది. వ‌రుస‌గా ఐదు మ్యాచుల్లోనూ విజ‌యాలు సాధించి 10 పాయింట్ల‌తో ప్ర‌స్తుతం ప‌ట్టిక‌లో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రో రెండు మ్యాచులు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్క‌దానిలోనైనా విజ‌యం సాధించినా ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండానే ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుతుంది. ఒక‌వేళ రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయిన‌ప్ప‌టికీ ఆసీస్‌కు అవ‌కాశం ఉంది. అయితే.. అప్పుడు నెట్ ర‌న్‌రేట్ కీల‌కం కానుంది.

న్యూజిలాండ్‌.. (8 పాయింట్ల‌)

ఈ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు 8 మ్యాచులు ఆడిన న్యూజిలాండ్ 4 మ్యాచుల్లో గెలిచి, మ‌రో నాలుగు మ్యాచుల్లో ఓడింది. 8 పాయింట్ల‌తో ప్ర‌స్తుతం ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉంది. లీగ్ ద‌శ‌లో కివీస్ త‌న చివ‌రి మ్యాచ్‌ను శ్రీలంక‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ కు ఖ‌చ్చితంగా చేరుతుంద‌ని చెప్ప‌లేము. ఎందుకంటే పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్లు త‌మ చివ‌రి మ్యాచుల్లో ఓడిపోతేనే కివీస్ పై ద‌శ‌కు వెలుతుంది. ఒకవేళ‌ ఓడిపోతే మాత్రం దాదాపుగా ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. నెట్‌ర‌న్ ప్ర‌కారం అవ‌కాశం రావాలంటే మాత్రం పాకిస్థాన్‌, ఆఫ్గాన్‌లు త‌మ‌కు మిగిలిన ఉన్న మ్యాచుల్లో ఓడిపోయి కివీస్ ర‌న్‌రేట్ మెరుగ్గా ఉంటేనే అవ‌కాశం ఉంటుంది. అయితే.. కివీస్ జ‌ట్టు తాము ఆడిన చివ‌రి నాలుగు మ్యాచుల్లోనూ ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం.

ODI World Cup 2023 : పాకిస్థాన్‌కు వ‌ర్షం సాయం చేస్తే.. ఐసీసీ షాకిచ్చింది

పాకిస్థాన్.. (8 పాయింట్లు)

ఈ మెగాటోర్నీలో పాకిస్థాన్ ఆట తీరును చూసిన ఎవ్వ‌రూ కూడా ఆ జ‌ట్టు సెమీస్ రేసులో ఉంటుంద‌ని అనుకోరు. అయితే.. ఆఖ‌రి మ్యాచులో కివీస్ పై భారీ తేడాతో గెలిచి సెమీస్ రేసులో నిలిచింది. అంతేనా నెట్ ర‌న్‌రేట్‌ను మెరుగుప‌ర‌చుకుంది. మొత్తంగా 8 మ్యాచులు ఆడిన పాకిస్థాన్ నాలుగు మ్యాచుల్లో గెలిచి, మ‌రో నాలుగు మ్యాచుల్లో ఓడింది. 8 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో త‌న చివ‌రి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ఆడ‌నుంది. ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ ఉన్న ఫామ్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే పాకిస్థాన్‌కు విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌క‌గానే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే పాకిస్థాన్ ఈజీగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఒక‌వేళ ఓడిపోతే మాత్రం ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాలు, ర‌న్‌రేట్ పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది.

అఫ్గానిస్థాన్‌.. (8 పాయింట్లు)

ప‌సికూన‌లుగా బ‌రిలోకి దిగి సంచ‌ల‌న విజ‌యాల‌తో సెమీస్ రేసులోకి దూసుకువ‌చ్చింది అఫ్గానిస్థాన్. ఏడు మ్యాచులు ఆడ‌గా నాలుగు మ్యాచుల్లో గెలిచి మ‌రో నాలుగు మ్యాచుల్లో ఓడింది. 8 పాయింట్లతో ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రో రెండు మ్యాచులు ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా అఫ్గాన్ సెమీస్ చేరే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ అఫ్గానిస్థాన్ చివ‌రి రెండు మ్యాచుల్లోనూ విజ‌యం సాధిస్తే అప్పుడు పాకిస్థాన్‌, న్యూజిలాండ్ ల‌కు ఎలాంటి అవ‌కాశం లేకుండా పోతుంది.

NZ vs PAK : ఒక్క సెంచ‌రీతో హీరో.. రివార్డు ప్ర‌క‌టించిన పీసీబీ.. ఎంతో తెలుసా..?

సెమీస్‌లో మ్యాచులు ఎలా..

పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి నాలుగు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. మొద‌టి, నాలుగో స్థానంలో నిలిచిన జ‌ట్ల మ‌ధ్య మొద‌టి సెమీఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జ‌ట్ల మ‌ధ్య రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త్ ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంతోనే సెమీస్‌కు చేర‌డం ఖాయం. దీంతో నాలుగో స్థానంలో నిలిచిన జ‌ట్టుతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. పై నాలుగు జ‌ట్ల‌లో భార‌త ప్ర‌త్య‌ర్థిగా సెమీస్‌లో ఎవ‌రు త‌ల‌ప‌డతారో చూడాల్సిందే.