WPL 2025 : సూపర్ ఓవర్‌లో ఓటమి.. ఎల్లీస్ పెర్రీకి క్షమాపణలు చెబుతూ భావోద్వేగానికి లోనైన స్మృతి మంధాన.. బాధగా ఉంది..
సూపర్ ఓవర్‌లో ఓటమి తరువాత ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది.

Smriti Mandhana emotional apology to Ellyse Perry after super over loss
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ టోర్నీ చరిత్రలో తొలి సారి సూపర్ ఓవర్‌లో మ్యాచ్ ఫలితం తేలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్‌లో యూపీ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తన జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీకి క్షమాపణలు చెప్పింది.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో 180 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో ఎలీస్ పెర్రీ (90 నాటౌట్; 56 బంతుల్లో 9ఫోర్లు, 3 సిక్సర్లు), డానీ వ్యాట్ (57; 41 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. 181 పరుగుల లక్ష్యంతో దిగిన యూపీ ఓ దశలో 134/8 తో ఓటమి దిశగా పయనించింది. అయితే.. ఆఖరిలో సోఫీ ఎకిల్‌స్టోన్ (33; 19 బంతుల్లో 1ఫోర్, 4సిక్సర్లు) రాణించడంతో స్కోరును సమయం చేసింది. ఆఖరి బంతికి సోఫీ రనౌట్ అయింది.
Smriti Mandhana said “Really have to tell Ellyse Perry sorry, how could we not win that game for her”. pic.twitter.com/FsbP0Q7Gat
— Johns. (@CricCrazyJohns) February 25, 2025
అనంతరం సూపర్ ఓవర్‌లో యూపీ జట్టు వికెట్ నష్టానికి 8 పరుగులే చేసింది. 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ కేవలం 4 పరుగులే చేసింది. స్మృతి మంధాన, రిచా ఘోష్‌లను ఔట్ చేసిన సోఫీ తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది.
కాగా.. ఆర్‌సీబీ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఎల్లీస్ పెర్రీ ని సూపర్ ఓవర్‌లో బరిలో దించలేదు మంధాన. ఇది ఆర్‌సీబీకి చేటు చేసింది. ఒకవేళ ఎల్లీస్ పెర్రీ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
దీనిపై మ్యాచ్ అనంతరం మంధాన మాట్లాడుతూ.. ఎల్లీస్ పెర్రీకి క్షమాపణలు చెప్పింది. ఎల్లీస్ మంచి ఆల్ రౌండర్ అని కితాబు ఇచ్చింది. ఆమె కోసం మ్యాచ్ గెలవలేకపోయినందుకు జట్టుగా తామంతా ఆమెకు సారీ చెప్పాలని అంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం తమను నిరాశకు గురిచేసినట్లుగా వెల్లడించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో మంచిగా రాణించినప్పటికి ఇలాంటి ఫలితం రావడంతో ఎంతో బాధగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే.. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని, ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని బలంగా తిరిగొస్తామని మంధాన తెలిపింది.
కాగా.. అంతకు ముందు ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఓడిపోయింది. ఆమ్యాచ్‌లో కూడా ఎల్లీస్ పెర్రీ 43 బంతుల్లో 81 పరుగులతో అదిరిపోయే ప్రదర్శన చేసింది.