WTC Final Qualification : భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకునేందుకు ఉన్న 4 మార్గాలు ఇవే..
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది.

WTC Final Qualification Exact Results India Need To Qualify For Title Decider
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆస్ట్రేలియా మూడు, న్యూజిలాండ్ నాలుగు, శ్రీలంక ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐదు జట్లకు ఫైనల్ చేరుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయన్న సంగతి తెలిసిందే.
కాగా.. భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవాలంటే ఉన్న మార్గాలు ఇవే..
సమీకరణం 1 : భారత్ 5-0, 4-1, 4-0 లేదా 3-0తో ఆస్ట్రేలియాను ఓడిస్తే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత జట్టు 5-0, 4-1, 4-0 లేదా 3-0 తేడాతో గెలిస్తే.. అప్పుడు మిగిలిన జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా భారత జట్టుకు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా ఫైనల్ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది.
సమీకరణం 2 : భారత్ 3-1తో ఆస్ట్రేలియాపై గెలిస్తే..
ఒకవేళ భారత్ ఐదు మ్యాచుల సిరీస్‌లో ఆస్ట్రేలియా పై 3-1 తేడాతో విజయం సాధిస్తే కూడా ఫైనల్ చేరుకుంటుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచులో శ్రీలంక ఓడిపోకూడదు. సఫారీల పై శ్రీలంక గెలవకపోయినా కనీసం మ్యాచ్ డ్రా అయినా చాలు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటుంది.
సమీకరణం 3 : ఆస్ట్రేలియా పై భారత్ 3-2 తేడాతో గెలిస్తే..
ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-2 తేడాతో గెలిస్తే మాత్రం అప్పుడు శ్రీలంక జట్టు సాయం అవసరం అవుతుంది. ఆస్ట్రేలియా శ్రీలంక జట్ల మధ్య జనవరి 29 నుంచి రెండు మ్యాచుల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచులను శ్రీలంక డ్రా చేసుకుంటే భారత్ ఈజీగా ఫైనల్ చేరుకుంటుంది.
సమీకరణం 4 : ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోపీ 2-2తో సమమైతే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2-2తో డ్రా అయితే.. భారత్ డబ్ల్యూటీసీ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. అలాంటప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో శ్రీలంకను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో ఓడించాలి. అదే సమయంలో ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు మ్యాచుల సిరీస్‌ను లంక గెలవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది.