Champions Trophy 2025: ‘వాళ్లను సొంతగడ్డపైనే ఓడించాలి’.. పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయంపై షోయబ్ అక్తర్ సీరియస్
ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించారు.

Shoaib Akhtar
Shoaib Akhtar: పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించారు. ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు నిబంధనలు పెట్టడం సరియైంది కాదని అన్నారు. భవిష్యత్ లో భారత దేశంలో నిర్వహించే ఐసీసీ టోర్నీల్లో తాము పాల్గొనమని అంటే ఎలా అంటూ ప్రశ్నించారు. భారత్ లో జరిగే క్రికెట్ టోర్నీల్లో పాల్గొనాలని, వాళ్లను వారి సొంతగడ్డపైనే ఓడించి రావాలని అక్తర్ సూచించారు.
పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ట్రోఫీకి పాకిస్థాన్ ఆధిత్యమిస్తుంది. అయితే, భారత్ జట్టు ఎప్పటినుంచో పాకిస్థాన్ లో జరిగే మ్యాచ్ లకు దూరంగా ఉంటుంది. పాక్ నిర్వహించే టోర్నీల్లో హైబ్రిడ్ మోడల్ పద్దతిలో తటస్థ వేదికలపై భారత్ జట్టు మ్యాచ్ లు ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించాలని భారత్ జట్టు ఐసీసీకి సూచించింది. కానీ, పాకిస్థాన్ అందుకు తొలుత అంగీకరించలేదు. ఐసీసీ సూచనతో హైబ్రిడ్ మోడల్ లో భారత్ జట్టు ఆడే మ్యాచ్ లు నిర్వహణకు అంగీకరించింది. అయితే, ఈ సందర్భంగా ఐసీసీ ముందు పీసీబీ కొన్ని షరతులు విధించింది.
పాక్ క్రికెట్ బోర్డు పేర్కొన్న ప్రకారం.. హైబ్రిడ్ పద్దతిలో ఛాంపియన్ ట్రోఫీ వన్డే టోర్నీ నిర్వహణకు అంగీకరిస్తాం. కానీ, భవిష్యత్తు లో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్ కు వెళ్లకూడదని నిర్ణయిస్తే ఆ మ్యాచ్ లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా తమకు హామీ ఇవ్వాలని పేర్కొంది. అంతేకాక.. ఐసీసీ వార్షిక ఆదాయంలో తమ వాటాను పెంచాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కండీషన్లపై షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించారు. భారత్ లో నిర్వహించే ఐసీసీ టోర్నీలను కూడా హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను అక్తర్ తప్పుబట్టారు. భవిష్యత్ లో భారత్ కు పాకిస్థాన్ వెళ్లాలని, వారిని సొంతగడ్డపైనే ఓడించి రావాలని అక్తర్ సూచించారు. అక్తర్ సూచనలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిగణలోకి తీసుకుంటుందా.. లేదా అనేది వేచిచూడాల్సిందే.