Yograj Singh : ఐపీఎల్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి టార్గెట్ పెట్టిన యోగరాజ్ సింగ్..
ఐపీఎల్‌లో విధ్వంసకర శతకంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.

Yograj Singh sets target for IPL wonderkid Vaibhav Suryavanshi
ఐపీఎల్‌లో విధ్వంసకర శతకంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. తన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే రాజస్థాన్ రాయల్స్ తరుపున ఏడు మ్యాచ్‌ల్లో 206.55 స్ట్రైక్‌రేటుతో 252 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం చేసి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు సన్నద్దం అవుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో 90 బంతుల్లోనే 190 పరుగులు సాధించాడు. ఇక ఈ యువ ఆటగాడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమ్ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సైతం వైభవ్ సూర్యవంశీని మెచ్చుకున్నాడు. అదే సమయంలో అసలైన ప్రతిభ అనేది కేవలం టెస్టు క్రికెట్ ద్వారా మాత్రమే తెలుస్తుందని స్పష్టం చేశాడు.
‘టెస్టు క్రికెట్‌కే నేను ప్రాముఖ్యం ఇస్తాను? సుదీర్ఘ ఫార్మాట్‌లో ఐదు రోజులు ఆడగలరా? అదే నిజమైన పరీక్ష.’ అని యోగరాజ్ అన్నాడు. వన్డేలు, టీ20లు అనే ఫార్మాట్‌లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. కానీ మూడు ఫార్మాట్లు ఉన్నందున అన్ని ఫార్మాట్లలో ఆడే ఫిట్‌నెస్‌ను కలిగి ఉండాలన్నాడు. ఇప్పుడున్న కుర్రాళ్లు టీ20లు, ఐపీఎల్, వన్డేలపై మాత్రమే దృష్టి పెడుతున్నారని చెప్పాడు. నిజం చెప్పాలంటే వీళ్లలో 50 ఓవర్లు ఆడే ఓపిక కూడా లేదన్నాడు.
యోగరాజ్ అక్కడితో ఆగలేదు. అతను కోచ్‌లు, నిర్వాహకులను విమర్శించాడు. వారికి అభిరుచి లేదని ఆరోపించాడు. కొందరు కోచ్‌లు, నిర్వాహకులు ఏసీల కింద కూర్చుని పనులు చేయాలనుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. తాను మాత్రం యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్లను తయారు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఎండలో కష్టపడుతున్నట్లు తెలిపాడు.