Ather Voice Feature: ఈ స్కూటీ మీతో మాట్లాడుతుంది.. ‘ఆథర్’లో అద్భుతమైన ఫీచర్.. ఏది అడిగినా చెప్తుంది!
'వాయిస్ ఆన్ ఆథర్' (Ather Voice Feature) ఫీచర్‌ను జెన్ 3, ఆపై మోడల్స్ ఉపయోగిస్తున్న కస్టమర్లందరికీ ఓవర్ ది ఎయిర్ అప్డేట్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు.
Ather energy rolls out voice on ather features for gen 3 scooters
- ఆథర్లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్
- భారతీయుల యాసకు తగిన టెక్నాలజీ
- ఓటీఏ ద్వారా రోలవుట్ పూర్తి
Ather Voice Feature: ఇంతకాలం రోడ్లపై రయ్..రయ్.. అంటూ యమ స్పీడ్ గా వెళ్లే బైక్ లనే చూసుంటారు కానీ, ఎక్కడైనా మాట్లాడే బైక్ ను చూశారా. ఇప్పుడు అలాంటి బైక్ నే మీ ముందుకు రానుంది. ఈ విషయంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఆథర్ ఎనర్జీ తన వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అందించింది. సిఈఓ తరుణ్ మెహతా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం, ‘వాయిస్ ఆన్ ఆథర్’ (Ather Voice Feature) ఫీచర్‌ను జెన్ 3, ఆపై మోడల్స్ ఉపయోగిస్తున్న కస్టమర్లందరికీ ఓవర్ ది ఎయిర్ అప్డేట్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. మనం గూగుల్ అసిస్టెంట్ లేదా సిరిని ఉపయోగించినట్లే, ఇకపై వాయిస్ కమాండ్స్‌తో నేరుగా స్కూటర్‌తో మాట్లాడవచ్చు.
ఇండియన్ యాక్సెంట్‌కు తగ్గట్టుగా LLM టెక్నాలజీ:
ఈ నూతన వాయిస్ అసిస్టెంట్ మన భారతీయుల యాసను, భాషా శైలిని సులువుగా అర్థం చేసుకునేలా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ద్వారా రూపొందించబడింది. నావిగేషన్, కాల్స్, మీడియా కంట్రోల్స్, వెహికల్ సెట్టింగ్స్ వంటి విభాగాల్లో ఇది పని చేస్తుంది. “సమీపంలోని ఛార్జర్ ఎంత దూరంలో ఉంది?” అని అడగడం లేదా “స్క్రీన్ బ్రైట్నెస్ పెంచు” అని చెప్పడం ద్వారా బైక్ సెట్టింగ్స్‌ను హ్యాండ్స్-ఫ్రీగా మార్చుకోవచ్చు. ఇది ఆథర్ హాలో స్మార్ట్ హెల్మెట్‌తో పాటు ఇతర బ్లూటూత్ హెడ్సెట్లకు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఏ మోడళ్లకు అందుబాటులో ఉంది?
ఈ వాయిస్ ఫీచర్ ఆథర్ 450X, 450 అపెక్స్, రిజ్తా Z మోడళ్లలో మాత్రమే పని చేస్తుంది. అయితే ఎంట్రీ లెవెల్ మోడళ్లయిన 450S, రిజ్తా S లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. త్వరలోనే ఈ సిస్టమ్‌ను ‘టూ-వే ఇంటరాక్షన్’ గా మార్చనున్నామని, దీనివల్ల గుంతలు, టైర్ ప్రెజర్, నోటిఫికేషన్లను స్కూటరే స్వయంగా రైడర్‌కు ముందస్తుగా హెచ్చరిస్తుందని సిఈఓ తరుణ్ మెహతా వెల్లడించారు. మరి ఈ అత్యాధునిక బైక్ ను మార్కెట్ లో ఏ మేరకు సక్సెస్ అవుతాయి అనేది చూడాలి.
