Deepfake Scammers : డీప్‌ఫేక్ రొమాన్స్ స్కామ్ గుట్టురట్టు.. 46 మిలియన్ డాలర్లు కొట్టేసిన స్కామర్లు.. పోలీసులు ఎలా ఛేదించారంటే?
Deepfake Scammers : డీప్‌ఫేక్ రొమాన్స్ స్కామ్ గుట్టురట్టు చేశారు హాంకాంగ్ పోలీసులు. బాధితుల నుంచి 46 మిలియన్ డాలర్లు కొట్టేసిన స్కామర్లను పోలీసులు పట్టుకున్నారు? అసలేం జరిగింది పూర్తి వివరాలను తెలుసుకుందాం.

deepfake scammers stole 46 million dollars from men in India ( Image Source : Google )
Deepfake Scammers : ఆన్‌లైన్ స్కామర్లతో జాగ్రత్త.. కొత్త డీఫ్‌ఫేక్ టెక్నాలజీతో వందల కోట్లు కాజేస్తున్నారు. బాగా తెలిసిన వ్యక్తిగా పరిచయం చేసుకుని అవసరానికి డబ్బులు అడుగుతూ అడ్డంగా మోసగిస్తున్నారు. డీఫ్‌ఫేక్ రొమాన్స్ స్కామ్‌తో వలపు వల విసురుతూ డబ్బులు దండుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ అనేక మంది బాధితులు ఈ డీప్ ఫేక్ స్కామ్ బారినపడ్డారు. ప్రధానంగా హాంకాంగ్, తైవాన్, చైనా, సింగపూర్, భారత్‌లో రొమాన్స్ స్కామ్ పేరిట బాధితులను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
అయితే, తాజాగా హాంకాంగ్‌లోని పోలీసులు డీప్‌ఫేక్ స్కామ్‌ను ఛేదించారు. అనుమానాస్పద వ్యక్తుల నుంచి 46 మిలియన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ మీడియా, టెక్నాలజీ గ్రాడ్యుయేట్లు, అనుమానిత ట్రయాడ్ సభ్యులతో సహా 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హాంకాంగ్‌లోని హంగ్‌హోమ్‌లోని ఓ పారిశ్రామిక యూనిట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రింగ్ అనుమానాస్పద బాధితుల నుంచి 46 మిలియన్ డాలర్లు కాజేసినట్టు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగింది? ఈ డీప్ ఫేక్ స్కామ్ ఆపరేషన్‌ను పోలీసులు ఎలా చేధించారు? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
డీప్‌ఫేక్ స్కామ్ గుట్టురట్టు.. :
డీప్‌ఫేక్ అనేది మానిప్యులేట్ చేసిన మీడియా.. ఇందులో ఒక వ్యక్తి పోలికను మరో ఫొటో లేదా వీడియోలో మరొకరితో రిప్లేస్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్‌ల ద్వారా ఈ డీప్ ఫేక్ ఫేస్ క్రియేట్ చేస్తారు. ఎస్‌సీఎంపీ ప్రకారం.. రింగ్ 2023 అక్టోబర్‌లో హాంకాంగ్‌లోని హంగ్‌హోమ్‌లో 4వేల చదరపు అడుగుల పారిశ్రామిక యూనిట్‌లో తన స్థావరాన్ని ఏర్పాటు చేసింది.
రింగ్ రిక్రూట్‌లతో ర్యాంక్‌లను విస్తరించింది. కనీసం 21 మంది పురుషులు, 6 మహిళలను ఈ స్కామ్‌లోకి దింపారు. వారిలో ఎక్కువ మంది బాగా చదువుకున్నవారు, డిజిటల్ మీడియా, టెక్నాలజీలో పట్టభద్రులే ఉన్నారు. రొమాన్స్ స్కామ్‌ను సెటప్ చేయడంలో వీరిని రిక్రూట్ చేసుకున్నట్టుగా న్యూ టెరిటరీస్ సౌత్ రీజనల్ క్రైమ్ సీనియర్ సూపరింటెండెంట్ ఫాంగ్ చి-కిన్ పేర్కొన్నారు.
నిందితులు డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఆకర్షణీయమైన మహిళల ఫొటోలతో తమ ముఖాలను మార్చుకున్నారు. స్కామర్లు బాధితులతో స్నేహంగా ఉండటం మొదలుపెట్టారు. బాధితులను నమ్మించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. ముందుగా అందంతో ఆకర్షించేందుకు ప్రయత్నించారు. అసలైన వ్యక్తిగా నమ్మించి బాధితుల నుంచి డబ్బు సాయం చేసేలా ప్రేరేపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బాధితులతో సంబంధాన్ని కొనసాగించేందుకు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమంగా రూపొందించిన ఫోటోలను పంపారు.
ఇదంతా బాధితులను, ఎక్కువగా పురుషులను క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆకర్షిస్తారని సీనియర్ సూపరింటెండెంట్ ఫాంగ్ చి-కిన్ పేర్కొన్నారు. ఒక స్కామర్ స్నేహితునిగా నటిస్తూ బోగస్ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, ఇతర పథకాల పేరుతో మోసగిస్తారు. కల్పిత లాభ లావాదేవీల రికార్డులను క్రియేట్ చేసి బాధితులను నమ్మించే ప్రయత్నం చేస్తారని ఫాంగ్ చెప్పారు. అంతేకాదు.. బాధితులతో భవిష్యత్తు ప్రణాళికలను కూడా చర్చించినట్టు తెలిపారు.
సీఎన్ఎన్ ప్రకారం.. గత ఆగస్టులో పోలీసులు ఈ డీప్ ఫేక్ స్కామ్ ముఠాపై రైడ్ చేయకముందు ఈ ఆపరేషన్ దాదాపు ఏడాది పాటు కొనసాగింది. ఈ దాడుల్లో 100 సెల్‌ఫోన్‌లు, 26 వేల డాలర్ల నగదు, లగ్జరీ వాచ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, భవిష్యత్తులో అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. జనవరి 2020 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రొమాన్స్ స్కామ్‌లలో బాధితులు 75 బిలియన్ డాలర్లు కోల్పోయారని టెక్సాస్ యూనివర్శిటీ అధ్యయనాన్ని వెబ్‌సైట్ పేర్కొంది.