iPhone 16 Pro Price : ఆపిల్ బిగ్ ఈవెంట్‌కు ముందే లేటెస్ట్ ఐఫోన్ 16 ప్రో ధర వివరాలు లీక్..!
iPhone 16 Pro Price Leak : ఆపిల్ బిగ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే రాబోయే ఆపిల్ 16 ప్రో సిరీస్ ధర వివరాలు లీక్ అయ్యాయి.

Fresh iPhone 16 Pro price details leak hours ahead of Apple event tonight
iPhone 16 Pro Price Leak : మరికొద్ది నిమిషాల్లో ఆపిల్ బిగ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. ఆపిల్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 9న భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ లాంచ్ ఈవెంట్‌కు కొన్ని గంటల ముందే రాబోయే ఆపిల్ 16 ప్రో సిరీస్ ధర వివరాలు లీక్ అయ్యాయి. బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ ప్రకారం.. ఐఫోన్ 16 ప్రో ధర గురించి తాజా వివరాలు బయటకు వచ్చాయి. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధరను 999 వద్ద ఉంటుందని లీక్ డేటా సూచిస్తోంది.
అంతేకాదు.. ఐఫోన్ 16 ప్రో లైనప్‌లో సన్నగా ఉండే బెజెల్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్, అన్ని మోడళ్లలో టచ్-సెన్సిటివ్ కెమెరా బటన్ వంటి ఇతర ముఖ్యమైన అప్‌గ్రేడ్స్ ఉండవచ్చునని గుర్మాన్ సూచించారు. ఏఐ సామర్థ్యాలు, మొత్తం ఐఫోన్ 16 సిరీస్‌కు పవర్ అందించే కొత్త ఎ18 చిప్‌పై ప్రధాన దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తోంది.
ఆపిల్ హబ్ ద్వారా గత లీక్ డేటాలో ఐఫోన్ ప్రో మోడల్‌ల ధరల పెంపును సూచించింది. ఐఫోన్ 16ప్రో మోడల్ 256జీబీ వేరియంట్‌కు 1,099 డాలర్లు (సుమారు రూ. 92,300) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ధర 1,199 డాలర్లు (సుమారు రూ. 1,00,700) నుంచి ఉండవచ్చు.
ఐఫోన్ 16 బేస్ మోడల్ ధర (అంచనా) :
యూఎస్ మార్కెట్లో, బేస్ ఐఫోన్ 16 మోడల్ ధర 799 డాలర్లు (సుమారు రూ. 67,100), ఐఫోన్ 16 ప్లస్ ధర 899 డాలర్లు (సుమారు రూ. 75,500)గా ఉండవచ్చు. అయితే, దిగుమతి సుంకాలు, పన్నుల కారణంగా భారతీయ వినియోగదారులకు ఐఫోన్ 16 సిరీస్ అధిక ధరలకు లభించే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900, ఐఫోన్ 15 ప్రో మాక్స్ రూ.1,59,900తో ప్రారంభమైంది. ఐఫోన్ 15 బేస్ మోడల్ రూ. 79,900, ప్లస్ వేరియంట్ ధర రూ. 89,900. లేటెస్ట్ లీక్ ప్రకారం.. ఐఫోన్ 15 ప్రో ధరలో కొత్త వెర్షన్‌ను అందించాలని కంపెనీ నిర్ణయించుకుంటే.. భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,34,900 ఉండవచ్చు.
ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కంపెనీ ఈ వేరియంట్ ధరను పెంచవచ్చునని లీక్ డేటా సూచిస్తోంది. అధికారికంగా దీనిపై ఎలాంటి ధృవీకరణ లేదు. ఆపిల్ ఈ రాత్రి ఐఫోన్ 16 సిరీస్‌ను అధికారికంగా ఆవిష్కరించడానికి రెడీగా ఉంది. ఈ లీక్‌లు ఎంత కచ్చితమైనవో తెలియదు. కానీ,టెక్ దిగ్గజం ఐఫోన్ అభిమానుల కోసం ఎలాంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుందో చూడాలి.