టిక్‌టాక్‌ కథ క్లోజ్ అయింది.. ఇక మిగిలింది పబ్జీనేనా..?

  • Published By: sreehari ,Published On : July 28, 2020 / 02:45 PM IST
టిక్‌టాక్‌ కథ క్లోజ్ అయింది.. ఇక మిగిలింది పబ్జీనేనా..?

Updated On : July 28, 2020 / 3:28 PM IST

దేశ భద్రతా కారణాలతో గతంలో 59 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. తాజాగా మరో 47 యాప్‌లను బ్యాన్ చేసింది. నిషేధిత యాప్‌లకు ఇవి క్లోన్లుగా వ్యవహరిస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ చైనా యాప్‌లేనని తేల్చారు అధికారులు. ఇక్కడితే అయిపోలేదు.. మరో 275 చైనా యాప్‌లను నిషేధించే అంశాన్ని కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది.

వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత అవతలి వాళ్లకి చేరే అవకాశం ఉండడంతో కేంద్రం ఈ యాప్స్‌పై వేటు వేసింది. ఓవైపు సరిహద్దు వివాదంపై చైనాతో చర్చలు జరుగుతున్న క్రమంలోనే కేంద్రం నిర్మోహమాటంగా ఈ నిర్ణయం తీసుకుంది. చైనా విషయంలో వెనకడుగు వేసేది లేదనే సందేశాన్ని భారత్ మరోసారి గట్టిగా పంపింది.

పబ్‌జీ గేమ్‌కి అడిక్ట్ అయిన టీనేజర్స్‌ :
టిక్‌టాక్ త‌ర్వాత అత్యంత ప్రజాధరణ పొందిన చైనా యాప్ పబ్జీ. ప్లేయర్స్ అన్‌నోన్స్‌ బ్యాటిల్ గ్రౌండ్‌గా పిలిచే ఈ యాప్‌కి లక్షలాది మంది బానిసలైపోయారు. ఆండ్రాయిడ్‌‌‌‌ మొబైల్‌‌‌‌లో కొత్త వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే 2 జీబీ డేటా అవసరం. అయినప్పటికీ చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారంటే ఎంతగా ఎడిక్ట్‌‌‌‌ అయ్యారో అర్థంచేసుకోవచ్చు.

గేమింగ్ అంతా ఒకెత్తు అయితే ఆన్‌లైన్‌లోనే చిన్నగా బెట్టింగ్ కూడా మొదలైంది. పబ్ జీ టోర్నమెంట్స్, లూడో వరల్డ్ లాంటి ఆటలలో ఆన్లైన్ పేమెంట్స్ తో చిన్న చిన్న బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. యే పబ్‌జీ వాలా హై క్యా.. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తన కుమారుడు పబ్‌జీ ఆటకు బానిసయ్యాడంటూ ఓ తల్లి ప్రధాని మోదీకి చేసిన ఫిర్యాదు ఇది. ఇంతలా జనం ఈ ఆటకు అలవాటుపడిపోయారు.

కొందరు పిచ్చోళ్లుగా.. మరికొందరు ఉన్మాదుల్లా..
గంటల తరబడి పిల్లలు పబ్జీ గేమ్ ఆడుతున్నారు. దానికి అడిక్ట్ అయిపోయారు. తిండితిప్పలు మానేసి మరీ ఆడుతున్నారు. ఈ క్రమంలో కొందరు పిచ్చోళ్లుగా మారుతున్నారు. మరికొందరు ఉన్మాదుల్లా తయారవుతున్నారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.

దీంతో పేరెంట్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పబ్జీ గేమ్‌ని దక్షిణ కొరియాకి చెందిన గేమ్ స్టూడియో బ్లూహోల్ తయారు చేసింది. ఈ గేమ్ పాపులర్ అయ్యాక చైనా కంపెనీ టెన్సెంట్ దీన్ని తమ దేశంలో అనుమతించేందుకు డీల్ కుదుర్చుకుంది. క్రమంగా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని పెంచుకుంటూపోయింది.

పబ్జీతో పాటు అలీ ఎక్స్‌ప్రెస్‌, లూడో యాప్‌లు బ్యాన్! : 
పబ్‌జీ, లూడో వరల్డ్‌.. ఈ రెండు గేమ్స్‌ యాప్‌లపై నిషేధం విధించే ఆలోచనలో ఉంది భారత్. ఇప్పటికే పొరుగు దేశం పాకిస్థాన్, నేపాల్, ఇరాక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. పాపులర్ ఆన్‌లైన్ గేమ్ పబ్ జీని బ్యాన్ చేశాయి. ఎంటర్‌ టైన్‌మెంట్‌ కోసం ఆడే లూడో గేమ్‌ కత్తులతో దాడి చేసుకునే దాకా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ గేమ్స్ యాప్స్‌ ఇన్‌స్టాల్ చేసుకుని హ్యాపీగా ఆడేస్తున్నాం.

కానీ మనకు తెలియకుండానే మన సమాచారాన్ని తస్కరిస్తున్నాయి. పరోక్షంగా మన డేటా మొత్తం లీక్ చేస్తున్నాయి. అందుకే పబ్జీతో పాటు అలీ ఎక్స్‌ప్రెస్‌, లూడో సహా చైనాకు చెందిన 275 యాప్‌ల‌పై కేంద్రం నిషేదం దిశ‌గా అడుగులు వేస్తోంది.

గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి డ్రాగన్‌కు చెందిన యాప్‌ల‌పై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులోభాగంగా ఇప్పటికే టిక్‌టాక్‌, యూసీ బ్రౌజ‌ర్ స‌హా 59 యాప్‌ల‌ను నిషేధించింది. ఇప్పుడు జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నా మ‌రో 275 చైనా యాప్‌లను గుర్తించారు.

కేంద్రం ముందుకు లీకేజీ సమాచారం :
నిబంధ‌న‌ల్ని ఉల్లంఘిస్తూ భార‌త వినియోగ‌దారుల డేటా చోరీకి గురవుతుందంటూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం ముందుంచారు. యాప్‌ బ్యాన్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుద‌ల కానుంది.

చైనాకు చెందిన అన్నిటెక్ కంపెనీలు.. ప్రభుత్వం ఏ స‌మాచారాన్ని కోరినా ఇవ్వాల్సిందిగా 2017 నాటి చ‌ట్టంలో ఉంది. ఈ క్రమంలో భార‌త్ స‌హా వివిధ దేశ వినియోగ‌దారుల‌ డేటాపై డ్రాగ‌న్ నియంత్రణ ఉండే ఛాన్స్ ఉండ‌టం ఆందోళ‌న కలిగిస్తోంది. ఇప్పటికే దీనిపై భార‌త్‌ను అనుస‌రించి చైనా యాప్‌ల‌ను నిషేదించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కూడా ట్రంప్‌కు లేఖ రాశారు.

యాప్స్‌ బ్యాన్‌ అంశాన్ని లేవనెత్తిన చైనా :
యాప్ లపై నిషేధం విధించిన తరువాత చైనా అధికారుల్లో కొంత మేర మార్పు కనిపించింది. ఈ మధ్య ఇరు దేశాల మధ్య జరిగిన డిప్లొమాటిక్ సమావేశంలో తమ దేశ యాప్‌ల నిషేధించిన అంశాన్ని చైనా లేవనెత్తగా.. భారత్ అంతే ఘాటుగా సమాధానం ఇచ్చింది.

దేశ భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నామని చైనాకు స్పష్టం చేసింది. భారత పౌరులకు సంబంధించిన ఎలాంటి డేటా కూడా మూడో వ్యక్తికి అందకుండా చూస్తున్నామని చెప్పినా.. భారత్‌ పరిగణనలోకి తీసుకోలేదు.

చైనా కంపెనీలు తమ యాప్‌ల ద్వారా భారతీయుల డేటాను సేకరించి పంపుతున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి సమాచారం వచ్చిన తరువాత.. జూన్ 29న భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్.. సెక్షన్ 69 ఏ కింద 59 చైనీస్ యాప్ లను నిషేధించారు. చైనా యాప్ ల నిషేధం తరువాత.. అంతర్జాతీయ విదేశాంగ పెట్టుబడిదారుల చట్టపరమైన హక్కులను పరిరక్షించడం భారతదేశ కర్తవ్యం అని చైనా విదేశాంగ శాఖ స్పందించింది.

డ్రాగన్‌తో ఇక యుద్ధమేనా..?  :
ఇందులోభాగంగానే చైనా ఆర్థిక మూలాలపై దెబ్బతీయాలని భారత్‌ డిసైడ్ అయిందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెల్లారి లేస్తే మన మీద పడి బతుకుతున్న చైనా.. మనకే పక్కలో బళ్లెంలా తయారవుతోంది. అన్యాయంగా మన సైనికులను పొట్టనబెట్టుకుంటోంది. ఈ పరిణామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కేంద్రం హెచ్చరికలు పంపుతోంది. భారత్ ఇస్తున్న షాక్‌లతో జిన్‌ పింగ్‌ సర్కార్‌కు మైండ్ బ్లాంక్ అవుతోంది.