Hyderabad Police: హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్‌జెండర్లు నియామకం.. విధుల్లోకి ఎప్పుడంటే?

తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో ట్రాన్స్ జెండర్లకు ..

Hyderabad Police: హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్‌జెండర్లు నియామకం.. విధుల్లోకి ఎప్పుడంటే?

Transgenders Recruited As Traffic Assistants In Hyderabad

Updated On : December 5, 2024 / 9:11 AM IST

Transgenders Recruited in Hyderabad Traffic: తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో ట్రాన్స్ జెండర్లకు ఈవెంట్స్ నిర్వహించారు. నగర సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో అభ్యర్థుల సెలెక్షన్స్ నిర్వహించారు. 18ఏళ్లు పూర్తయిన వారు, 10వ తరగతి సర్టిఫికెట్స్, ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ ఆధారంగా అభ్యర్థులకు అధికారులు ఈవెంట్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్స్ లో 58మంది ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు. 800 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్ల రన్నింగ్, షార్ట్ ఫుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించారు. ఇందులో మొత్తం 44 మంది ట్రాన్స్ జెండర్లను అధికారులు ఎంపిక చేశారు.

Also Read: Gossip Garage : ఎవరి తల్లి వారిదే.. ఎవరి గీతం వారిదే..! రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా ఒడవని పంచాయితీ..

ట్రైనింగ్ అనంతరం విధుల్లోకి..
క్వాలిఫై అయిన 44 మంది ట్రాన్స్ జెండర్లకు ఫిజికల్ ఫిట్ నెస్ ను పరిశీలించారు. ఈవెంట్స్ లో ఉత్తీర్ణులైన వారికి నగర సీపీ ఆనంద్ సెలెక్షన్ సర్టిఫికెట్ అందించారు. ఎంపికైన వారికి యూనిఫామ్ కోసం కొలతలు తీసుకున్నారు. షూ సైజ్ సేకరించారు. వీటి ఆధారంగా డ్రెస్ కోడ్ కు సంబంధించిన యూనిఫామ్ లను సిద్ధం చేస్తారు. మరోవైపు ఎంపికైన ట్రాన్స్ జెండర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ట్రైనింగ్ అనంతరం విధుల్లో నియమిస్తారు. తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణకు వీరిని నియమించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. సిటీ పోలీస్ తో పాటు రాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్ కు మంచిపేరు తీసుకురావాలని, కమ్యూనిటీ ఒక రోల్ మోడల్ గా కావాలని సూచించారు.

 

సీఎం రేవంత్ సూచన మేరకు..
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్ జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు సూచించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు తొలి రిక్రూట్ మెంట్ నిర్వహించారు. హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్లో ట్రాన్స్ జెండర్ల నియామకాలు కొనసాగాయి.