Gossip Garage : ఎవరి తల్లి వారిదే.. ఎవరి గీతం వారిదే..! రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా ఒడవని పంచాయితీ..

అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలకు పోయి రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు ఉద్యమకారులు.

Gossip Garage : ఎవరి తల్లి వారిదే.. ఎవరి గీతం వారిదే..! రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా ఒడవని పంచాయితీ..

Updated On : December 5, 2024 / 12:21 AM IST

Gossip Garage : ఏ రాష్ట్రానికి అయినా రాష్ట్ర గీతం ఒకటే ఉంటుంది. ఆరాధించే తల్లి కూడా ఒకటే ఉంటుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి సీన్ మారుతోంది. మీ తల్లే మీదే..మా తల్లి మాదే. మీ గీతం మీదే..మా గీతం మాదే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రభుత్వం చెప్పిన మాట అపోజిషన్ వినదు. అప్పటి ప్రభుత్వం రూపొందించిన వాటిని ఇప్పటి ప్రభుత్వం ఒప్పుకోదు. దీంతో రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా లొల్లి కంటిన్యూ అవుతోంది. ఇంతకీ రెండు తల్లులు, రెండు రాష్ట్ర గీతాల లొల్లి ఏంటీ? జనాల్లో కన్ఫ్యూజన్‌ పోయేదెట్లా.?

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కథ మొదటికి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహం..రాష్ట్ర చిహ్నం, రిజిస్ట్రేషన్ నెంబర్‌ ప్లేట్‌పై టీఎస్‌ అని పెట్టేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కథ మొదటికి వచ్చింది. అధికారి పార్టీ తెలంగాణ తల్లిని ఓ రూపంలో కొలుస్తుంటే..అపోజిషన్ బీఆర్ఎస్ తాము ముందుగా రూపొందించిన తెలంగాణ తల్లినే ఆరాధిస్తుంది. ఇక రాష్ట్ర గీతం పరిస్థితి కూడా అంతే. జయజయహే తెలంగాణ విషయంలోనూ ఎవరి గీతం వారిదే అన్నట్లు అయిపోయింది సిచ్యువేషన్.

కొత్త రూపంలో తెలంగాణ తల్లి..
మీ బీఆర్ఎస్ తల్లి మీదే, మా కాంగ్రెస్‌ తల్లి మాదే అన్నట్లుగా మరో తెలంగాణ తల్లి విగ్రహం సిద్దం చేయిస్తున్నారు సీఎం రేవంత్. కేసీఆర్‌ తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఆయన కూతురు కల్వకుంట్ల కవిత పోలికలు కనిపిస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించే వారు. తెలంగాణ తల్లి అంటే గడిలో ఉండే రాణీగారు కారని, రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ప్రతీకగా ఉండాలంటూ చెప్పుకొచ్చారు. అప్పుడు మాట్లాడినట్లుగానే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మారుస్తున్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్‌లో కొత్త రూపంలో తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ఇప్పటికే విగ్రహా తయారీ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త తెలంగాణ విగ్రహంలో సోనియా గాంధీ రూపం కనిపిస్తోందని విమర్శలు..
తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న రేవంత్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు గులాబీ నేతలు. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ విగ్రహాన్ని మారుస్తున్నారని మండిపడుతున్నారు. కొత్త తెలంగాణ విగ్రహంలో సోనియా గాంధీ రూపం కనిపిస్తోందని విమర్శిస్తోంది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే డిసెంబర్ 9న కొత్త రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టబోతున్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ మాత్రం తాము మొదటి నుంచి ఆరాధిస్తున్న తెలంగాణ విగ్రహా రూపాన్నే అదే రోజు మేడ్చల్‌లో ఏర్పాటు చేస్తామంటోంది. ఇలా ఎవరి తల్లి వారిదే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో రూపొందించి తెలంగాణ తల్లి రూపాన్ని కాంగ్రెస్ సర్కార్ ఒప్పుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేస్తున్న కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని బీఆర్ఎస్ ఒప్పుకోవడం లేదు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు తెలంగాణ తల్లిని ఆరాధిస్తున్నారు.

రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ విషయంలోనూ ఇదే రచ్చ..
రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ విషయంలోనూ ఇదే రచ్చ జరుగుతోంది. పాత పాటనే తమ పార్టీ సమావేశాల్లో ఆలపిస్తూ వస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ నేతలు మాత్రం తాము అధికారంలోకి వచ్చాక మార్చిన గీతాన్ని ఫాలో అవుతున్నారు. వాహనాల నెంబర్ల ప్లేట్‌పై టీఎస్, టీజీ విషయంలోనూ ఎవరూ తగ్గడం లేదు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్చినప్పుడు కూడా బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఎవరూ తగ్గడం లేదు. పదేళ్లు ఓ రూపంలో తెలంగాణ తల్లిని, గీతాన్ని ఆలపించిన జనాలకు ఇప్పుడు కొత్త తల్లి, కొత్త గీతం అందుబాటులోకి తేవడం ఏంటన్న చర్చ తెరమీదకు వస్తోంది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతం మీద ఈ పంచాయితీ ఏంటని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాలకు పోయి రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆగ్రహం..
అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలకు పోయి రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు ఉద్యమకారులు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్ల పాలన పూర్తయ్యాక..ఇప్పుడు ఎవరి తల్లి వారిదే..ఎవరి గీతం వారిదే అని నడుచుకుంటూ వెళ్తే ఎలా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఊరూరా పాత తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఏ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఫాలో కావాలి..ఏ గీతాన్ని ఆలపించాలో సాధారణ ప్రజలకు అర్థం కావట్లేదని..ఈ కన్ఫ్యూజన్‌కు ఎండ్‌ కార్డ్‌ వేయాలని కోరుతున్నారు. తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతంపై అధికార, విపక్షాల పట్టుదలలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి మరి.

 

Also Read : సీఎం రేవంత్ వాగ్ధాటిలో ఘాటు ఎందుకు తగ్గినట్లు? రీజన్ ఏంటి?