Gossip Garage : సీఎం రేవంత్ వాగ్ధాటిలో ఘాటు ఎందుకు తగ్గినట్లు? రీజన్ ఏంటి?

సీఎం రేవంత్ రెడ్డిలో వచ్చిన ఈ మార్పు మంచికే అంటున్నారట కాంగ్రెస్ నేతలు.

Gossip Garage : సీఎం రేవంత్ వాగ్ధాటిలో ఘాటు ఎందుకు తగ్గినట్లు? రీజన్ ఏంటి?

Telangana CM Revanth Reddy

Updated On : December 4, 2024 / 10:53 PM IST

Gossip Garage : సార్ మారిపోయారు. రూటు మార్చారు. సున్నితంగా సుతిమెత్తంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పేస్తున్నారు. ప్రతిపక్షాల పేరెత్తితే చాలు..ఒంటికాలు మీద లేచే సీఎం రేవంత్‌..మాట తీరు మారినట్లు కనిపిస్తోంది. మొన్నటి దాక అపోజిషన్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన సీఎం..ఇప్పుడు వాగ్ధాటిలో ఘాటు తగ్గించారన్న చర్చ జరుగుతోంది. సీఎం మాట తీరులో మార్పు ఎందుకు వచ్చినట్లు? రేవంత్‌ వైఖరిలో మార్పునకు రీజన్‌ ఏంటి.?

సడెన్‌గా ఆయనది స్వీటు వాయిస్‌ అయిపోయిందన్న చర్చ..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార మాట తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నాలుగు రోజులుగా ప్రజా విజయోత్సవ సభల్లో సీఎం మాట్లాడుతున్న తీరు ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మాట తీరు చాలా ఘాటుగా ఉండేది. బీఆర్ఎస్ నేతల పేరు ఎత్తినా.. మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావించినా..ఓ రేంజ్‌లో ఫైరయ్యేవారు రేవంత్. కానీ ఇప్పుడు సడెన్‌గా ఆయనది స్వీటు వాయిస్‌ అయిపోయిందన్న చర్చ జరుగుతోంది.

ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో ఘాటుగా మాట్లాడే వారు సీఎం. మరీ ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను మాటలతో చీల్చి చెండాడే వారు. దాంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడారేమో కానీ..ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ తన మాట తీరును మార్చుకోవాలన్న చర్చ కూడా జరిగింది. అంతలా ప్రతిపక్షాలపై విరుచుకుపడే వారు సీఎం రేవంత్ రెడ్డి.

ఘాటు పదాలు లేవు, వ్యక్తిగత విమర్శలూ లేవు..
కారణమేదైనా సీఎం రేవంత్ రెడ్డి మాట తీరులో స్పష్టమైన మార్పు వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రజా విజయోత్సవ సభల్లో సీఎం.. చాలా నెమ్మదిగా, ఎంతో పద్దతిగా మాట్లాడుతుండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట. మొన్న మహబూబ్‌నగర్‌లో రైతు పండుగ సంబరాల నుంచి మొదలుపెడితే హైదరాబాద్ అభివృద్ది సభ వరకు ఎక్కడ మాట్లాడినా చాలా లైటర్‌ వేలో సీఎం ప్రసంగం కొనసాగుతోంది. గత ఏడాది కాలంగా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం ప్రభుత్వం ఏం చేసింది, రానున్న రోజుల్లో ఏం చేయబోతోందన్న విషయాలను మాత్రమే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి.

ఇదే సమయంలో ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడే సమయంలో ఘాటు పదాలు వాడటం లేదు. మరీ ముఖ్యంగా ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. కేవలం ప్రతిపక్షాలు ఏం చేయాలో, వారి పాత్ర ఏంటో అన్నది మాత్రం హితోపదేశం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీంతో ఇంత సడెన్‌గా సీఎం రేవంత్ రెడ్డిలో ఈ మార్పుకు కారణం ఏంటని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రజల్లోకి కూడా మంచి సంకేతాలు వెళ్తాయని టాక్..
ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా నిర్వహిస్తున్న సభల్లో ఏం చేశామో చెప్పుకుండా..ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు చేస్తే అసలు విషయం మరుగున పడుతుందన్న యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. విజయోత్సవాల్లో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తే మీడియా దాన్నే హైలెట్ చేస్తుందని, తాము చేసిన మంచి పనులు, సాధించిన విజయాలు ప్రజల్లోకి అంతగా వెళ్లవని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే గత నాలుగైదు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన పరిధిలో మాట్లాడుతున్నారు.

ఎక్కడా ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటుగా మాట్లాడటం లేదు. కేవలం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను చెబుతూ..ప్రతిపక్షాలు ఏం చేయాలో వారికి సూచనలు ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిలో వచ్చిన ఈ మార్పు మంచికే అంటున్నారట కాంగ్రెస్ నేతలు. ముఖ్యమంత్రి హోదాలో ఇలా హుందాగా వ్యవహరిస్తే ప్రజల్లోకి కూడా మంచి సంకేతాలు వెళ్తాయని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

 

 

Also Read : రెండో ఏడాదిలో పాలనను పరుగులు పెట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్..